Shraddha Walker Murder Case: Shocking Facts About Her Life And What Led To Cruel Murder - Sakshi
Sakshi News home page

Shraddha: కుటుంబంలో సహజీవనం చిచ్చు.. ముంబై నుంచి ఢిల్లీకి! ఆఖరికి ఫ్రిడ్జ్‌లో ముక్కలుగా.. పాల ప్యాకెట్లతో పాటు అవి కూడా

Published Wed, Nov 16 2022 7:41 PM

Shraddha Walker Assassination Aftab Poonawalla Shocking Facts - Sakshi

సాధారణంగా కొనగలిగే స్థితి ఉన్న ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్‌ ఉంటుంది.. అలాగే ఆ ఇంట్లో కూడా! కానీ అందరి ఇళ్లలో లాగా అందులో కేవలం కూరగాయలు, పండ్లు, పాలు, నీళ్లు మాత్రమే కాదు.. ముక్కలు ముక్కలుగా చేసిన మనిషి అవయవాలు కూడా ఉన్నాయి! 

అంతేనా.. ఆ ఫ్రిడ్జ్‌ ఓనర్‌ ఆ అవయవాలతో పాటు తను తినే ఆహార పదార్థాలను కూడా అందులోనే పెడతాడు. అర్ధరాత్రుళ్లు నిద్రలేచి ఆ ఫ్రిడ్జ్‌ను తెరిచి అందులో ఉన్న ఆ అవయవాలను తీసుకుని.. ఢిల్లీ రోడ్లపై అంతటా విసిరేస్తాడు. 

ఐదు నెలల తర్వాత అసలు విషయం బయటపడటంతో పోలీసుల చేతికి చిక్కాడు ఆ వ్యక్తి. అతడి పేరు ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా. తనను నమ్మి.. తల్లిదండ్రులను కూడా కాదనుకుని.. తన వెంట వచ్చిన యువతిని అత్యంత పాశవికంగా హత్య చేసిన క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతడిని పిచ్చిగా ప్రేమించి తొలుత తల్లిదండ్రులకు.. ఆ తర్వాత ఈ లోకానికి శాశ్వతంగా దూరమైన అమ్మాయి శ్రద్ధా వాకర్‌.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై స్పందించిన మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ బేడి.. ఆడ పిల్లలు తమకు దూరంగా ఉన్నా.. తమను కాదనుకుని వెళ్లిపోయినా నిరంతరం వాళ్లను గమనిస్తూనే ఉండాలంటూ తల్లిదండ్రులకు ఓ సూచన చేశారు. శ్రద్ధ ఇలా బలైపోవడంలో ఆమె తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా బాధ్యత ఉందంటూ చర్చకు తెరతీశారు.

ఇంతకీ శ్రద్ధ విషయంలో ఏం జరిగింది? ఆమె నిండు నూరేళ్ల జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడానికి అసలు కారకులు ఎవరు? అమ్మాయైనా, అబ్బాయైనా ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నంత మాత్రాన పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టడం సబబేనా? కాస్త ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే గుడ్డిగా ఓ వ్యక్తిని నమ్మి జీవితాన్ని పణంగా పెట్టడం సరైందేనా? ఆఫ్తాబ్‌ లాంటి దుర్మార్గుల చేతుల్లో ఇంకెంత మంది శ్రద్ధలు బలైపోవాలో అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు.

ముచ్చటైన కుటుంబం
మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన వికాస్‌ వాకర్‌ తనకున్న ఎలక్ట్రానిక్స్‌ సర్వీస్‌ షాప్‌ ద్వారా ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు భార్య సుమన్‌,25 ఏళ్ల కూతురు శ్రద్ధ, 23 ఏళ్ల కొడుకు శ్రీజయ్‌ ఉన్నారు.

ఉద్యోగం వెతుక్కునేందుకు 2018లో ముంబైకి వచ్చింది శ్రద్ధ. మలాద్‌లోని ఓ బహుళజాతి కంపెనీ కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం సంపాదించింది. ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా కూడా అదే కాల్‌ సెంటర్‌లో పనిచేసేవాడు.

చిచ్చు పెట్టిందెవరు?
అలా ఒకే చోట పనిచేస్తున్న క్రమంలో డేటింగ్‌ యాప్‌ ద్వారా మరింత చేరువై ఇద్దరూ ‘ప్రేమ’లో పడ్డారు. 2019 నుంచి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. మలాద్‌లోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసే ఉండేవారు. కొన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని శ్రద్ధ తన తల్లికి చెప్పింది.

అలాగే కూతురి సహజీవనం గురించి తండ్రికి కూడా తెలిసింది. కూతురి నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. పూర్తి వివరాలు తెలుసుకుందామని శ్రద్ధను ఓసారి పాల్ఘర్‌కు రమ్మన్నారు. అందరికీ ఇలాంటివి అచ్చిరావని... ఆఫ్తాబ్‌తో బంధం తెంచుకోమంటూ బిడ్డకు నచ్చజెప్పచూశారు.


PC: Instagram

‘‘మీ దృష్టిలో నేను ఇక నుంచి చచ్చిన శవాన్ని’’
కానీ.. ఆమె వినలేదు. తను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతో గొడవపడి తన వస్తువులు తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ‘‘మీ దృష్టిలో నేను ఇక నుంచి చచ్చిన శవాన్ని’’ అంటూ వాళ్లను వీడింది. కానీ.. శ్రద్ధకు అప్పుడు తెలియదు ప్రియుడి రూపంలో చావు తనను సమీపిస్తోందని!

తమ మాట వినలేదన్న కోపమో... మరీ ఎక్కువగా వాదిస్తే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనన్న భయమో.. కూతురు కోరుకున్నట్లుగానే తల్లిదండ్రులు ఆమెకు దూరంగా ఉండసాగారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో తనను ఫాలో అయ్యే తన స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు శ్రద్ధ గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు.

తల్లి మరణం తర్వాత
ఇక శ్రద్ధ తల్లి కూతురి మీద ప్రేమ చంపుకోలేక అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు. జనవరి 23, 2020లో ఆమె కన్నుమూశారు. కన్నతల్లిని కడసారి చూసేందుకు వచ్చిన శ్రద్ధ అంత్యక్రియలు ముగియగానే మళ్లీ ఆఫ్తాబ్‌ దగ్గరికి వెళ్లిపోయింది.

కూతురి విషయాన్ని భర్తతో చర్చించిన శ్రద్ధ తల్లి.. ఆఫ్తాబ్‌ ప్రవర్తన గురించి ఆయనకు చెప్పారు. ఆఫ్తాబ్‌ తరచుగా తమ కూతురిని హింసిస్తున్నాడన్న విషయాన్ని భర్తతో పంచుకున్నారు. అతడిని వదిలేయమని చెప్పినా వినడం లేదంటూ తల్లి హృదయం ఎంతగా విలవిల్లాడుతుందో భర్తకు చెప్పుకొన్నారు.

ఎంత అమాయకత్వం తల్లీ!
కనీసం తల్లి మరణం తర్వాతైనా కూతురిలో మార్పు వస్తుందేమోనన్న ఆశతో శ్రద్ధతో మరోసారి ఆఫ్తాబ్‌ గురించి మాట్లాడాడు వికాస్‌. కానీ.. లాభం లేకుండా పోయింది. ఆఫ్తాబ్‌ తనను తిట్టినా కొట్టినా సారీ చెబుతాడంటూ తండ్రికే నచ్చజెప్పబోయింది. అంతగా అతడి ‘ప్రేమ మాయ’లో పడిపోయిందామె.

కూతురి అమాయకత్వానికి మరింతగా బాధపడ్డ ఆ తండ్రి.. ఆఫ్తాబ్‌ నుంచి విడిపోతేనే నీ బతుకు బాగుంటుందంటూ మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తను వినకపోవడంతో రెండేళ్లుగా ఆమెతో మాట్లాడమే మానేశాడు ఆ మనసు విరిగిన తండ్రి. అయితే, కూతురి స్నేహితుల ద్వారా ఆమె క్షేమసమాచారాలు తెలుసుకుంటేనే ఉన్నాడు.

ముంబై నుంచి ఢిల్లీకి
సహజీవనం గురించి ఆఫ్తాబ్‌ ఇంట్లో కూడా తెలిసిపోవడంతో వాళ్లు కూడా వ్యతిరేకించారు. ఓవైపు కుటుంబాలకు దూరం.. మరోవైపు.. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలన్న ఆశ.. ఆఫ్తాబ్‌తో కలిసి ఢిల్లీకి పయనమైంది శ్రద్ధ.

మొదటి రోజు ఓ హోటల్లో స్టే చేశారు. మరుసటి రోజు మరో హోటల్‌కు తీసుకెళ్లాడు ఆఫ్తాబ్‌. మూడో రోజు ఛత్తర్‌పూర్‌లో తమ స్నేహితుల ఇంట్లో​ తలదాచుకున్నారు. అక్కడే ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. అదే శ్రద్ధను శాశ్వతంగా నిద్రపుచ్చిన చోటు! అప్పటికే ఆఫ్తాబ్‌ ఉద్యోగం సంపాదించాడు. శ్రద్ధ జాబ్‌ కోసం వెదుకులాట మొదలుపెట్టింది. 

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌
ఆఫ్తాబ్‌తో కలిసి ఉన్న సమయంలో కుటుంబంలో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్న శ్రద్ధ తండ్రి, సోదరుడితో మాట్లాడటం మానేసింది. అయితే, ఆమె స్నేహితుల ద్వారా ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్నారు వాళ్లు!

శ్రద్ధ సోదరుడు శ్రీజయ్‌ స్నేహితుడు లక్ష్మణ్‌ నాడార్‌ 2022 సెప్టెంబరులో ఆమెకు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తోందని అతడికి చెప్పాడు. గత రెండు నెలలుగా ఇదే తంతు అని.. అక్క గురించి తెలుసుకోమంటూ సూచించాడు. 

తమకు శ్రద్ధ కాంటాక్ట్‌లో లేదని చెప్పాడు శ్రీజయ్‌. ఈ విషయం గురించి తండ్రితో చెప్పడంతో.. వికాస్‌ శ్రద్ధ గురించి లక్ష్మణ్‌తో మాట్లాడాడు. గతంలో తాను రెండు మూడుసార్లు శ్రద్ధతో మాట్లాడానని.. అయితే, రెండు నెలలుగా మాత్రం తనతో కాంటాక్ట్‌లో లేదని, మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోందని చెప్పాడు లక్ష్మణ్‌.

కీడు శంకించిన తండ్రి మనసు
తండ్రి మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే శ్రద్ధ మిగతా ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడాడు. వాళ్ల నోటి నుంచి కూడా అదే మాట! రెణ్నెళ్లుగా స్విచ్ఛాఫ్‌! ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించాడు శ్రద్ధ తండ్రి వికాస్‌. కూతురి మిస్సింగ్‌ కేసు ఫైల్‌ చేశాడు.

ఆమె ఢిల్లీలో ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసులను ఆరాతీశారు. దీంతో నవంబరు 9న శ్రద్ధ తండ్రి పేర ఢిల్లీలోని మెహ్రౌలీలో గల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆఫ్తాబ్‌తో పాటు తన కూతురు ఛత్తర్‌పూర్‌లో సహజీవనం చేస్తోందని పోలీసులకు చెప్పాడు వికాస్‌.

దీంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ముందుగా ఆఫ్తాబ్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. మే 19 నుంచి అతడు ఢిల్లీలోనే ఉన్నట్లు లొకేషన్‌ ద్వారా ట్రేస్‌ చేశారు. అదే రోజు నుంచి శ్రద్ధ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిన విషయాన్ని కూడా గమనించారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఆఫ్తాబ్ ఇంటికి చేరుకుని ఇంటరాగేషన్‌ మొదలుపెట్టారు.

కట్టుకథ బాగానే అల్లాడు
తనను నమ్మి వచ్చిన శ్రద్ధను ప్రేమ పేరిట వంచించి ఆమెను పొట్టనపెట్టుకున్న ఆఫ్తాబ్‌ తనకేమీ తెలియదన్నట్లు పోలీసుల ముందు ఓ కట్టుకథ అల్లాడు. శ్రద్ధతో తనకు ఓ రోజు పెద్ద గొడవ కావడంతో ఆమె ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోయిందని.. ఆమెతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిందంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఇల్లంతా వెదికారు పోలీసులు.

కానీ వాళ్లకు ఆధారాలేమీ దొరకలేదు. అయినా మరోసారి అతడిని విచారించగా ఈసారి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసుల అనుమానం బలపడింది. తమదైన శైలిలో విచారించగా.. నోరు విప్పి అసలు నిజం చెప్పాడు ఆఫ్తాబ్‌. నిశ్చేష్టులవడం అక్కడున్న వాళ్ల వంతైంది.

శ్రద్ధ పాలిట కాళరాత్రి
మే 18న శ్రద్ధ- ఆఫ్తాబ్‌ల మధ్య గొడవ జరిగింది. ఇంకెన్నాళ్లు సహజీవనం.. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది శ్రద్ధ. ససేమిరా అన్నాడు ఆఫ్తాబ్‌. గొడవ పెద్దదైంది. శ్రద్ధ గొంతును గట్టిగా నులిమాడు ఆఫ్తాబ్‌. ఆమె ఊపిరి ఆగేంత వరకు అలా గొంతును నొక్కిపెట్టాడు. ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలా అని కుయుక్తులు పన్నాడు.

ఫ్రిడ్జ్‌ కొని...
మే 19న ఆఫ్తాబ్‌ స్థానిక మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడే ఓ షాపులో పెద్ద ఫ్రిడ్జ్‌ కొన్నాడు. ఇంటికి వచ్చి శ్రద్ధ శవాన్ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ముక్కముక్కలుగా నరికాడు. కొని తెచ్చిన పాలిథీన్‌ కవర్లలో వాటిని వేశాడు. ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ ఎండాకాలం కావడంతో బాడీ పార్ట్స్‌ నుంచి వాసన రావడం మొదలైంది. దీంతో ఆ దుర్వాసన పోగొట్టేందుకు రూమ్‌ ఫ్రెషనర్స్‌ స్ప్రే చేసేవాడు ఆఫ్తాబ్‌.

మరీ ఇంత క్రూరంగా
శ్రద్ధ శవాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆఫ్తాబ్‌.. అదే ఫ్రిడ్జ్‌లో మంచినీళ్లు, పాల ప్యాకెట్లు పెట్టుకునేవాడు. రోజుకు కొన్ని అవయవాలు ముక్కలు చేసేవాడు. బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తినేవాడు. 

తెల్లవారుజామున రెండు గంటలకు నిద్రలేచి.. ఆ ముక్కలను పాలిథీన్‌ కవర్లలో నింపి మెహ్రౌలీ అటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడక్కడా పారేసేవాడు. మళ్లీ తిరిగొచ్చి ఏమీ తెలియనట్లుగా తన రూమ్‌లో నిద్రపోయేవాడు. అలా 18 రోజుల పాటు ఇదే తంతు. జూన్‌ 5 వరకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శ్రద్ధ బాడీ పార్ట్స్‌ను పడేశాడు ఆఫ్తాబ్‌. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారితో మాట్లాడేవాడు కాదు అతడు.

పోలీసుల గాలింపు
ఆఫ్తాబ్‌ చెప్పిన విషయంతో పోలీసులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. అతడిని తీసుకుని ఏయే చోట్ల అవయవాలు పడేశాడు ఆయా చోట్లకు వెళ్లారు పోలీసులు. కొన్నిచోట్ల మాత్రమే ఆధారాలు సేకరించగలిగారు. ఇప్పటికే హత్య జరిగి ఐదు నెలలు పూర్తైంది కాబట్టి అన్నీ సేకరించడం కాస్త కష్టంగా మారింది.

నన్నెలా పట్టుకుంటారు?
అంత దారుణంగా ఓ అమ్మాయిని పొట్టనబెట్టుకున్న ఆఫ్తాబ్‌కు తనపై తనకు నమ్మకం ఎక్కువ. పోలీసులు తన దాకా రాలేరని భావించాడు. అందుకే ఫ్రిడ్జ్‌ను అలాగే ఇంట్లో పెట్టుకున్నాడు. ఫోరెన్సిక్‌ టెస్టులో దీని ద్వారా ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. 

అయితే, శ్రద్ధ శవాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన కత్తి మాత్రం ఇంకా పోలీసులకు దొరకలేదు. ప్రస్తుతం ఆఫ్తాబ్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కాబట్టి త్వరలోనే ఆ కీలకమైన ఆధారాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. ఇక ఇంతటి హేయమైన నేరానికి పాల్పడ్డ ఆఫ్తాబ్‌.. శ్రద్ధ శవాన్ని మాయం చేయడంలో అమెరికన్‌ క్రైమ్‌ సిరీస్‌ డెక్స్‌టర్‌ స్ఫూర్తి అని చెప్పడం గమనార్హం.

నేను నమ్మను.. నా కూతురు లేదంటే నేను నమ్మను
శ్రద్ధ తండ్రి తన కూతురు లేదన్న నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నారు. తన కూతురిని ఇంత దారుణంగా చంపినా ఆఫ్తాబ్‌లో పశ్చాత్తాపం లేదని.. నేరాన్ని అంగీకరించే సమయంలోనూ తనెంతో మామూలుగా కనిపించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్‌ నివేదికలు వచ్చి.. ఆ బాడీ పార్ట్స్‌ తన కూతురివి అని తేలిన తర్వాతే నమ్ముతానంటూ బోరున విలపించారు.

నమ్మించి నిట్టనిలువునా కూలదోసి
ఆఫ్తాబ్‌ను నమ్మి తన ప్రాణాలు పోగొట్టుకుంది శ్రద్ధ. శ్రద్ధ మాత్రమే కాదు ఆఫ్తాబ్‌ లాంటి మేకవన్నె పులులను నమ్ముతున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కిరణ్‌ బేడి అన్నట్లుగా శ్రద్ధ తల్లిదండ్రులు మాత్రమే కాదు.. వాళ్లతో ఆఫ్తాబ్‌ పేరెంట్స్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్నారు ఈ ఘటన గురించి తెలిసినవారు. ఆడపిల్లలతో పాటు అబ్బాయిల తల్లిదండ్రులు కూడా.. స్వచ్ఛమైన బంధాల గురించి పిల్లలకు చిన్ననాటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలని, కౌమార దశలో స్నేహితుల్లా మారి వారి అభిరుచులు తెలుసుకుంటూ.. ఆకర్షణకు, ప్రేమకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలిసేలా చేయాలని అంటున్నారు.
(ఇన్‌పుట్స్‌: ఇండియా టుడే)
చదవండి: Shraddha Murder Case: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్‌
ప్రేయసిని 35 ముక్కలు చేసిన హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..

Advertisement
 
Advertisement
 
Advertisement