నకిలీ బంగారం పెట్టి.. కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా

SBI Cashier Cheated Rs 60 lakhs With Fake Gold - Sakshi

రామాపురం: నకిలీ బంగారం పెట్టి కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా చేశాడు ఎస్‌బీఐలో పని చేసే ఓ క్యాషియర్‌. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన రామాపురంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్‌బీఐ రామాపురం బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు రవికుమార్‌. డబ్బు కాజేయాలనే దుర్బుద్ధితో ఓ ఎత్తుగడ వేశాడు. తనకు అనుకూలురైన సిబ్బందితో కథ నడిపాడు. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి తన కుటుంబసభ్యుల ఖాతాల ద్వారా లోన్‌ల పేరిట దాదాపు రూ.60 లక్షలు స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఖాతాదారుల పేర్లతో కూడా డబ్బు స్వాహా చేసినట్లు తెలుస్తుండటంతో ఈ మొత్తం కోటి రూపాయలు దాటుతుందని సమాచారం.

ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం అధికారులు ఈ విషయాన్ని గుర్తించి క్యాషియర్‌ రవికుమార్‌ను సస్పెండ్‌ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐబీఐ ఆర్‌ఎమ్‌ రామకృష్ణ, రామాపురం శాఖ మేనేజర్‌ నాగసుబ్రహ్మణ్యంలను వివరణ కోరగా నకిలీ బంగారంతో క్యాషియర్‌ రవికుమార్‌ డబ్బు తీసుకున్నమాట వాస్తవమేనని, అతడిని సస్పెండ్‌ చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఖాతాదారుల్లో ఆందోళన
నకిలీ బంగారంతో రుణాల పేరిట క్యాషియర్‌ రవికుమార్‌ భారీ మొత్తం స్వాహా చేసిన విషయం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసేందుకు, బంగారం దాచుకునేందుకు జంకుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దాచుకున్న బంగారం విడిపించుకోవాలని ఖాతాదారులు బ్యాంక్‌ చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలనుకున్నవారిని బ్యాంక్‌ అధికారులు వారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బంగారంపై పొందిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెళ్లినా వారు స్పందించడం లేదు.
చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top