వాంఖెడే X నవాబ్‌ మాలిక్‌

Sameer Wankhede to investigate drugs-on-cruise case - Sakshi

ముంబై మాదక ద్రవ్యాల కేసులో రోజుకో కొత్త మలుపు

అవినీతి దందా ఆరోపణలపై శాఖాపరమైన దర్యాప్తు మొదలు  

ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై  రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్‌ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్, సమీర్‌ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్‌ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది.  ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (డీడీజీ) జ్ఞానేశ్వర్‌ సింగ్‌ అవినీతి అరోపణలపై సమీర్‌ వాంఖెడే స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు.

వాంఖెడే స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్‌సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే  వివరాలను బయటపెట్టలేమన్నారు.  

అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్‌ఖాన్‌ని విడిచిపెట్టడానికి ఎన్‌సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్‌ సాయిల్‌ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్‌ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్‌కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు.   

ఆర్యన్‌ బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు
ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ఖాన్, అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్‌సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్‌ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గీ  చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

షారుఖ్‌కు గతంలో జరిమానా!
బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు సమీర్‌ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్‌ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన కాలంలోనే సమీర్‌... షారుఖ్‌కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్,  లండన్‌లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్‌ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్‌ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top