అద్భుత కలశం పేరుతో బురిడీ

Rs 9 lakhs Scam in name of Miracles Kalasam - Sakshi

రూ.9 లక్షల నగదుతో పరార్‌ 

లబోదిబోమంటున్న బాధితులు

నలుగురిపై కేసు నమోదు   

నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా) : తమ వద్ద అతీత శక్తులున్న అద్భుత కలశం ఉందంటూ చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె, కలికిరి మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురి నుంచి రూ.9 లక్షల నగదు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు ఆదివారం నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఎస్‌ఐ ఫాతిమా కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలం, వెంకోజిగారిపల్లెకు చెందిన మల్లేశ్వరరావు, తవళం గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి, కలికిరి మండలం, గొల్లపల్లెకి చెందిన చిన్నబ్బ, కలికిరికి చెందిన రమణారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇటీవల తిరువళ్లూరు జిల్లా, పల్లిపట్టు తాలూకా, కేశవరాజు కుప్పంకు చెందిన పలువురిని కలిశారు. తమ వద్ద అతీత శక్తులు కలిగిన, అద్భుత పురాతన కలశం ఉందని, దానికి చాలా మహిమలున్నాయని, గుప్త నిధులు, బియ్యం ఆకర్షించగలదని నమ్మించారు.

కలశం ఉన్నవారికి సిరి సంపదలు, అతీత శక్తులు సిద్ధిస్తాయని చెప్పారు. రూ.కోట్లు విలువ చేసే కలశాన్ని రూ.20 లక్షలకే ఇస్తామనడంతో వారి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో శనివారం నిమ్మనపల్లె మండలం, ముష్ఠూరు గ్రామం, బహుదా ప్రాజెక్టు వద్దనున్న అమ్మవారి గుడివద్ద కలశాన్ని అందజేస్తామన్నారు. బాధితులు శనివారం నిందితులను కలిసి, కలశం ఇవ్వాలని అడగ్గా.. గుడిలో కలశానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, పూజల అనంతరం రాత్రికి కలశాన్ని తీసుకెళ్లవచ్చునని చెప్పారు.

వారి మాటలు నమ్మి రూ.9 లక్షల నగదును నిందితులకు అందజేశారు. అంతే.. నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు. కలశం కోసం వెళ్లిన బాధితులకు అక్కడ కలశం లేకపోవడం.. నిందితులు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ ఫాతిమా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన మల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top