నల్లమలలో దారి దోపిడీ

Road robbery in Nallamala Forest area - Sakshi

బంగారం వ్యాపారుల్ని చితకబాది 450 గ్రాముల బంగారం, రూ.7 లక్షల నగదు అపహరణ 

కారును అటకాయించి దోపిడీకి పాల్పడిన దుండగులు 

గిద్దలూరు రూరల్‌: గుర్తు తెలియని దుండగులు బంగారం వ్యాపారులు ప్రయాణిస్తున్న కారును అటకాయించి.. అందులోని వారిని చితకబాది రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం దోచుకుపోయిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారి షేక్‌ బాజీవలి వద్ద షేక్‌ పీరావలి, సుభాషిణి, సైదా పనిచేస్తున్నారు.

ఆ ముగ్గురు శుక్రవారం నరసరావుపేట నుంచి కారులో నంద్యాల చేరుకున్నారు. వ్యా పార లావాదేవీలు ముగించుకున్న అనంతరం రూ.14 లక్షల నగదు, ఒక కిలో 300 గ్రాముల బంగారాన్ని కారులోని సీక్రెట్‌ లాకర్‌లో పెట్టి శనివారం రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇదే తరహాలో నరసరావుపేటకు చెందిన మరో ఇద్దరు బంగారు వ్యాపారులు పవన్‌ప్రదీప్, మొహిబ్‌ రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారాన్ని బ్యాగ్‌లో ఉంచుకుని నరసరావుపేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

బస్సులు లేవంటూ మొహిబ్‌ తనకు తెలిసిన తోటి బంగారు వ్యాపారి పీరావలికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వారిద్దరినీ తమ కారులోనే నరసరావుపేటకు రావచ్చని చెప్పడంతో అందరూ కలిసి ఒకే కారులో నరసరావుపేట బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారును ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు నంద్యాల నుంచి మరో కారులో వెంబడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడ్డగించి కారు లోని ఐదుగురిని చితకబాదారు.

అనంతరం వారిని బయటకు లాగిపడేసి కారుతో పాటు గా దుండగులు గిద్దలూరు వైపుగా వచ్చారు. దొంగిలించిన కారును కేఎస్‌ పల్లె సమీపంలోని బైరేనిగుండాల పైలట్‌ ప్రాజెక్టు క్రాస్‌ రోడ్డులో ఆపి కారులో పవన్‌ప్రదీప్, మొహిబ్‌లకు చెందిన రూ.7 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు ఐదుగురు నంద్యాల టూ టౌన్‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు గిద్దలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను గిద్దలూరు వైపు తీసుకొస్తున్న నేపథ్యంలో కేఎస్‌ పల్లె సమీపంలో కారును గుర్తించారు. కారులోని సీక్రెట్‌ లాకర్‌ను తెరిచి చూడగా కిలో 300 గ్రాముల బంగారం, రూ.14 లక్షల నగదు జాగ్రత్తగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏఎస్పీ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top