రిపబ్లిక్‌ టీవీ సీఎఫ్‌ఓకు సమన్లు

Republic TV CFO Summoned by Mumbai Police - Sakshi

10న విచారణకు హాజరుకావాలని  ముంబై పోలీసుల ఆదేశాలు  

ముంబై: ముంబైలో వెలుగు చూసిన టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్‌ టీవీ’ సీఎఫ్‌ఓ సుందరానికి పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అక్టోబర్‌ 10న విచారణకు హాజరు కావాలన్నారు. ఈ స్కామ్‌లో రిపబ్లిక్‌తో పాటు మరో 2 మరాఠీ చానళ్ల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.  

వినియోగదారులతో ఒప్పందాలు  
ముంబైలో టీఆర్‌పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్‌ చానల్‌తో పాటు రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి

స్టాండింగ్‌ కమిటీ ముందుకు!
టీఆర్‌పీ స్కామ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం.. పార్లమెంటరీ కమిటీ ఆన్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చీఫ్‌ శశి థరూర్‌కు లేఖ రాశారు. ఒక జాతీయ వార్తా చానల్‌ సహా 3 చానళ్లు ఈ స్కామ్‌లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అందువల్ల తదుపరి కమిటీ మీటింగ్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కార్తి చిదంబరం ఆ లేఖలో కోరారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top