దారుణం: పాపను చంపేసి.. గొనెసంచిలో కుక్కి | Relative Who Assassinated The Child In Prakasam District | Sakshi
Sakshi News home page

చిన్నారిని చంపింది బంధువే

Jul 11 2021 12:15 PM | Updated on Jul 11 2021 12:15 PM

Relative Who Assassinated The Child In Prakasam District - Sakshi

వైద్యశాల వద్ద ధర్నా చేస్తున్న బాలిక బంధువులు

ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆమెకు వరుసకు బాబాయేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి అంతమొందించాడు.

గిద్దలూరు(ప్రకాశం జిల్లా): ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆమెకు వరుసకు బాబాయేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి అంతమొందించాడు. మండలంలోని అంబవరంలో ఏడేళ్ల బాలిక డి.ఖాశింబీ గురువారం అదృశ్యమై శుక్రవారం మృతదేహమై గొనెసంచిలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..  ఖాశింబీని ఆమె సమీప బంధువు, వరుసకు బాబాయి అయ్యే సిద్ధయ్య తన ఇంట్లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశాడు. అనంతరం పాపను చంపేసి మృతదేహాన్ని గొనెసంచిలో కుక్కి గ్రామానికి సమీపంలోని చెట్లోలో పడేశాడు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తున్నా అతడు పట్టీపట్టనట్లు ఉన్నాడు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వాస్పత్రి వద్ద బంధువుల ఆందోళన 
నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బంధువులు శనివారం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.  దిశ ఘటనలో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ఖాశింబీ నిందితుడిని కూడా ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాలని బంధువులు డిమాండ్‌ చేశారు. మహిళా కమిషన సభ్యురాలు రమాదేవి ఆస్పత్రికి వచ్చి బాలిక మృతదేహాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. బాలిక హత్యకు సంబంధించిన వివరాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. సీఐ ఎండీ ఫిరోజ్‌తో మాట్లాడారు. నిందితుడు సిద్ధయ్య ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడని, తరుచూ వేధిస్తుండటంతో భార్య అలిగి కుమార్తెతో సహా పుట్టింటికి వెళ్లినట్లు తమ దర్యాప్తులో తేలిందని మహిళా కమిషన్‌ సభ్యురాలితో సీఐ చెప్పారు. హత్య కేసుగా నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు వివరించారు. నిందితుడిని  త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ తెలిపారు. పొదిలి సీఐ యూ.సుధాకర్‌రావు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్‌ఐలు వైద్యశాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే అన్నా పరామర్శ 
అంబవరంలో బాలిక హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శనివారం నేరుగా గ్రామానికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సీడీపీఓ లక్ష్మీదేవి, కొమరోలు మహిళా సంఘం అధ్యక్షురాలు వేణమ్మ, వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు నారాయణరెడ్డిలు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement