అట్టుడికిన కైకొండాయిగూడెం

Raghunadhapalem Village Attack On Corporator And Burned His Fortune Car In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం‌: ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ ధరావత్‌ రామ్మూర్తి నాయక్‌పై రఘునాథపాలెం మండలం కైకొండాయిగూడెం గ్రామంలో మంగళవారం దాడి యత్నం జరగడం, అతడి ఫార్చునర్‌ కారును తగలబెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 18వ తేదీన  కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్‌ ఆనంద్‌(23) అనే యువకుడు బైపాస్‌ రోడ్డు వెంట గల కార్పొరేటర్‌ రామ్మూర్తి ఫంక్షన్‌హాల్‌లో వెల్డింగ్‌ పనులకు వెళ్లి..అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఖమ్మంరూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో కార్పొరేటర్‌కు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య చర్చలు జరగ్గా విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తన డివిజన్‌ పరిధిలోని కైకొండాయిగూడెం హైస్కూల్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించి..ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అడ్డగించగా..కోపోద్రిక్తుడైన కార్పొరేటర్‌ అసభ్యపదజాలంతో దూషించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు కార్పొరేటర్‌పై దాడికి ప్రయత్నించగా ప్రాణభయంతో..పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి దాక్కున్నాడు.  స్థానికులు బయటి నుంచి తాళం వేసేశారు. అక్కడ ఏం జరుగుతుందోననే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన కుమారుడి మృతికి కారణాలు తెలపాలని తల్లి తేజావత్‌ విజయ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కార్పొరేటర్‌ రామ్మూర్తి సైతం తనపై దాడి యత్నం, కారు దహనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కారు ధ్వంసం, దహనం ఇలా..
పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్‌ను, స్థానిక గ్రామ పెద్ద గుర్రం వెంకటరామయ్యతో కలిసి బందోబస్తు నడుమ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత టూ టౌన్‌ సీఐ గోపి ఆందోళనకారులను సముదాయించి కార్పొరేటర్‌ కారును డ్రైవర్‌ ద్వారా పంపిస్తుండగా..ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. భయాందోళన చెందిన డ్రైవర్‌ దిగి పారిపోగా..ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. పోలీసుల సమాచారంతో ఫైరింజన్‌ అక్కడికి చేరుకోగా..అప్పటికే దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, పోలీసు బలగాలతో ఉన్న సమయంలోనే కారును తగలబెట్టడం చూస్తే గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. 


           గది నుంచి రామ్మూర్తినాయక్‌ను తరలిస్తున్న పోలీసులు (వృత్తంలో వ్యక్తి)  

3గంటలు భయం..భయం: బడిలో హడలిన ఉపాధ్యాయులు
గొడవతో కార్పొరేటర్‌ రామ్మూర్తి నాయక్‌  కైకొండాయిగూడెం ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి తల దాచుకున్నారు. గ్రామస్తులు వందల సంఖ్యలో అక్కడ గుమికూడడడంతో ఆన్‌లైన్‌ క్లాసుల కోసం వచ్చిన ఉపాధ్యాయులు కూడా భయంతో మరో గదిలోకి వెళ్లగా..అందులోకే రామ్మూర్తి నాయక్‌ వెంట వచ్చిన గుర్రం వెంకట్రామయ్య కూడా వెళ్లి దాక్కున్నాడు. పరిస్థితిని హెచ్‌ఎం డీఈఓకు ఫోన్‌లో వివరించారు. ఆ తర్వాత డయల్‌ 100కు చేస్తే అది గుంటూరుకు కలిసింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాక వీరంతా బయటకు వచ్చారు. కార్పొరేటర్‌ను ప్రశ్నించడం, దాడికి యత్నం, దాక్కోవడం, గ్రామంలో కారు ధ్వసం ఇలా..ఉదయం 10:30నుంచి మధ్యాహ్నం 2వరకు ఉద్రిక్తత నెలకొంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top