హైదరాబాద్‌ శివార్లలో  భారీగా పేకాట  

Police Busted Rummy Players Gang In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలోని ఫామ్‌హౌజ్‌లో భారీ పేకాట వ్యవహారాన్ని ఎస్‌వోటీ పోలీసులు ఛేదించారు. రెండు, మూడు రోజులు అడ్డావేసి పేకాట ఆడుదామని సిద్ధమైన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్‌ సినీహీరో నాగÔౌర్యకు చెందినదిగా ప్రచారం జరగడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. 

గోవాలోని కాసినోల తరహాలో.. 
హైదరాబాద్‌ శివార్లలో నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మంచిరేవుల వద్ద గ్రీన్‌లాండ్స్‌ వెంచర్‌ ఉంది. అందులో రమణ అనే వ్యక్తి చెందిన ఫాంహౌస్‌ను సినీహీరో నాగశౌర్య ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో టీవీ సీరియళ్లు, సినిమాల షూటింగ్‌లు, పార్టీలు జరుగుతుంటాయి. అయితే దీపావళి పండుగ వస్తుండటంతో భారీగా పేకాట నిర్వహించేందుకు కొందరు ప్లాన్‌ చేశారు.

నాలుగు రోజుల పాటు ఈ ఫాంహౌజ్‌ను వాడుకుంటామని సుమంత్‌ చౌదరి అనే పేరిట బుక్‌ చేసుకున్నారు. తరచూ గోవాలోని కాసినోలకు వెళ్లేవారిని సంప్రదించి ఇక్కడికి ఆహ్వానించారు. కాసినోల తరహాలో టేబుళ్లు, కాసినో కాయిన్లు, వందల పేకాట బాక్సులు, క్యాష్‌ కౌంటింగ్‌ మిషిన్లు, మద్యం, భోజన సదుపాయాలు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంపై శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆదివారం రాత్రి దాడి చేశారు. 

30 మంది అరెస్టు 
ఫామ్‌హౌజ్‌లోని పేకాట స్థావరంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 6.70 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. పేకాట స్థావరంలో అదుపులోకి తీసుకున్నవారి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వారిని రిమాండ్‌కు పంపే సమయంలో వివరాలు వెల్లడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్‌ తెలిపారు. 

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top