ఫ్రిజ్‌లో మృతదేహం: పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య | police Arrest Siddique Ahmed Deceased Case Accused In Hyderabada | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌లో మృతదేహం: పక్కా ప్లాన్‌ ప్రకారమే సిద్దిక్‌ హత్య

Apr 6 2021 7:28 AM | Updated on Apr 6 2021 8:54 AM

police Arrest Siddique Ahmed Deceased Case Accused In Hyderabada - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల 30న సిద్దిక్‌ అహ్మద్‌ తన భార్య రుబీనా బేగంతో పాటు పిల్లలను తీసుకొని శ్రీరాంనగర్‌లో ఉంటున్న బావమరిది ఇంటికి వెళ్ళారు. రాత్రి భోజనం అనంతరం 12 గంటల సమయంలో సిద్దిఖ్‌ ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే అతడి ఇంటి వద్ద మాటువేసిన మెకానిక్‌ సయ్యద్‌ మహ్మద్‌ అలీ కొద్ది సేపటి తర్వాత మొదటి అంతస్తులోని సిద్దిఖ్‌ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. అయితే అతను తలుపు తీయకపోవడంతో అక్కడి నుంచి బోరబండలోని తన నివాసానికి వెళ్లిన అలీ రాత్రి 2 గంటల సమయంలో మరోసారి వచ్చి తలుపు తట్టాడు.

లోపలి నుంచి స్పందన లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్న స్ఫూన్‌ సహాయంతో కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం షాకబ్జార్‌ తీసుకుని బోర్లా పడుకొని ఉన్న సిద్దిఖ్‌ తలపై బలంగా మోదడంతో సిద్దిఖ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం సిద్దిఖ్‌ వంటిపై ఉన్న బనియన్‌ తీసి అతడి తలకు గట్టిగా కట్టాడు. అయినా రక్తం ఆగకపోవడంతో అతడి మృతదేహాన్ని కర్టెన్‌లో చుట్టి వంటింట్లోకి లాక్కెళ్లాడు. ఫ్రిడ్జ్‌లో పెడితే రక్తం గడ్డకడుతుందని భావించిన అలీ తల భాగం వరకు ఫ్రిజ్‌లో పెట్టాడు. ఇందుకోసం దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించాడు. అదే సమయంలో మృతుడి భార్య రుబీనాకు వాట్సాప్‌ కాల్‌ చేసి భర్తను చంపిన విషయాన్ని చెప్పాడు. బెడ్‌రూంలో రక్తపు మరకలను శుభ్రం చేసి కిటికీ గ్రిల్స్‌ను యదాతథంగా పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా బయటికి వచ్చి మృతుడి వాహనం తీసుకొని ఉడాయించాడు.

నిందితుడు మహ్మద్‌ అలీ... 
సీసీ ఫుటేజీ, సెల్‌సిగ్నల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అలీని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యాయుధాన్ని, రక్తం శుభ్రం చేసేందుకు ఉపయోగించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అలీతో పాటు మృతుడి రుబీనాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం గత కొన్నేళ్లుగా సిద్దిఖ్‌ భార్య రుబీనాతో అలీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ విషయం తెలియడంతో సిద్దిఖ్‌ భార్యతో పలుమార్లు గొడవ పడుతున్నాడు. రుబీనా ఈ విషయాన్ని అలీ దృష్టికి తీసుకెళ్లగా సిద్దిఖ్‌ను హత్య చేస్తానని చెప్పాడు. అతడిని వారించిన రుబీనా విడాకులు తీసుకుంటానని చెప్పింది. అయితే గత కొద్ది రోజులుగా భర్త వేధింపులు తీవ్రం కావడంతో ఆమె ఆలీకి విషయం చెప్పింది.దీంతో అలీ సిద్ధిఖ్‌ను హత్య చేసేందుకు పథకం వేశాడు. ఇందులో భాగంగా బావమరిది ఇంటికి వెళ్లి వస్తున్న విషయం తెలుసుకొని వెంటాడి హత్య చేసినట్లు తెలిసింది.  

చదవండి: సిద్దిఖ్‌ను చంపి, అతని భార్యకు వీడియో కాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement