Petrol Bunk Fraud: కొలతల్లో ‘కోత’.. జేబులకు చిల్లు

Petrol Bunks Frauds Nellore District - Sakshi

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న వినియోగదారులు

లీటర్‌కు 200 ఎంఎల్‌ తక్కువగా వస్తున్న వైనం

జిల్లాలో సగటున రోజుకు 14 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్‌ విక్రయాలు

సాక్షి, నెల్లూరు: ఓ వైపు పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజూ పెరుగుతుంటే.. మరో వైపు పెట్రోల్‌ బంకుల దోపిడీ మితిమీరుతోంది. కొలతల్లో కోత పెట్టి వాహనచోదకుల జేబులకు చిల్లు పెడుతున్నారు. జిల్లాలో నిత్యం పెట్రోల్‌ బంకుల్లో విక్రయాల లెక్కలు చూస్తే రోజుకు రూ.కోట్లల్లో దోపిడీ జరుగుతున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలోని దాదాపు ఒకటీ.. రెండు చోట్ల తప్ప ప్రతి పెట్రోల్‌ బంకులో మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయనే జగద్వితం.

అయినా సంబంధిత తునికలు, కొలతల శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్నారు. ఈ శాఖ తనిఖీలు, జరిమానా లెక్కలు చూస్తేనే పనితీరు అర్థమవుతోంది. పెట్రోల్‌ బంకుల్లో చిప్‌ల టెక్నాలజీ సాయంతో మోసాలు జరుగుతున్నాయి.
చదవండి: బాబోయ్‌ ఎండలు.. అలా చేస్తే వాహనాలు పేలే ప్రమాదం

నెల్లూరు శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలోని పెట్రోల్‌ బంకులో ఓ వ్యక్తి పెట్రోలు పట్టించుకునేందుకు వెళ్లాడు. రూ.100కు పట్టమని చెప్పి.. పర్సులో నుంచి డబ్బులు తీసే సరికి  పెట్రోలు పోసే వ్యక్తి ఇంధనం నింపేశాడు. ఇంతలోనే పట్టడం అయ్యిందా? అని ప్రశి్నస్తే.. అంత అనుమానముంటే రీడింగ్‌ చూసుకోవాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ రోజు ఉదయం పని చేసే కార్యాలయానికి వెళ్తుండగా మధ్యలో వాహనం ఆగిపోయింది. వెంటనే పెట్రోలు బంకుకు వెళ్లి ఆ వ్యక్తిని నిలదీయగా.. మేం సక్రమంగానే పోశాం. మీరు ఎక్కడెక్కడ తిరిగారో అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి.

నగరంలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌ బిడ్జి వద్ద ఉన్న ఓ పెట్రోలు బంకులో రెండు రోజుల క్రితం ఒకరు వాహనానికి పెట్రోలు పోయించుకున్నాడు. కొలతపై అతనికి అనుమానం వచ్చి మళ్లీ లీటర్‌ బాటిల్‌లో లీటర్‌ పెట్రోలు పోయించుకోవడంతో 200 ఎంఎల్‌ తక్కువ వచ్చింది. ఆ లీటర్‌ బాటిల్‌ నిండా పట్టిస్తే రూ.150 చూపించింది. లీటర్‌కు దాదాపు 200 ఎంఎల్‌ తక్కువ రావడంతో నిలదీస్తే సిబ్బంది కానీ, యాజమాన్యం కానీ పట్టించుకోలేదు. దీనిపై బాధితులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇంధన వినియోగం పెరుగుతోంది. అందుకు తగిన విధంగా జిల్లాలో పెట్రోల్‌ బంకులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌ అత్యంత నిత్యావసర వినియోగం కావడంతో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్‌ బంకుల యజమానులు దోపిడీకి తెర తీస్తున్నారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, మరి కొందరు వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. ఇంధనం నాణ్యత, కొలతలపై తరచూ తనిఖీలు చేయాల్సిన పౌర సరఫరాలశాఖ అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.

రేటు వాత.. కొలత కోత 
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ ధరలు అటూ ఇటూగా ఉన్నాయి. పెట్రోల్‌ లీటరు 121.70, డీజిల్‌ రూ.107.70 ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో పెట్రోల్, డీజిల్‌ లీటరుపై సుమారు రూ.50 వరకు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతి రోజు లీటరుకు రూ.0.80 వంతున పెరుగుతూనే ఉంది. ఓ వైపు ధరలు ఇలా పెరుగుతుంటే.. మరో వైపు బంకుల్లో దోపిడీకి అంతూపంతూ లేకుండాపోయింది. లీటరుకు 200 ఎంఎల్‌ వరకు కోత పడుతున్నట్లు వినియోగదారులు గుర్తిస్తున్నారు.

సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా, గొడవ చేసినా స్పందన లేకపోవడంతో వినియోగదారులు సైతం పట్టింది పట్టించుకుని మౌనంగా వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే లీటరుకు 5 ఎంఎల్‌ వరకు ఇంధనం తక్కువ రావడం సహజం. అయితే అనేక బంకుల్లో 50 ఎంఎల్‌ నుంచి 200 ఎంఎల్‌ వరకు తేడా వస్తున్నట్లుగా వాహనదారులు వాపోతున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి తూనికలు, కొలతల శాఖ అధికారులు అడపా దడపా చేసిన తనిఖీల్లో కూడా భారీగానే మోసాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో కేటుగాళ్లు పెట్రోల్, డీజిల్‌లో తెల్ల కిరోసిన్‌ కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కన్నెత్తి చూడని అధికారులు  
పెట్రోల్‌ బంకుల్లో రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలున్నాయా లేదా నిర్వహణ తీరు తదితర అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖది. పెట్రోలు, డీజిల్‌ను వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయా? లేదా అనే విషయాలను  తూనికలు, కొలతల శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు తమ పరిధిలో ఉన్న బంకుల్లో ఎంత మేర నిల్వలున్నాయో కూడా చెప్పలేకపోతున్నారు. తూనికలు, కొలతలు శాఖ అధికారులు మాత్రం అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. ఏడాది మొత్తంలో 35 కేసులు నమోదు చేసి, రూ.9.70 లక్షల జరిమానా విధించారంటే ఈ శాఖ పనితీరును అర్థం చేసుకోవచ్చు.

రోజుకు రూ.3.36 కోట్ల దోపిడీ 
జిల్లాలో దాదాపు 210 పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ 14 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. లీటర్‌కు 200 ఎంఎల్‌ తక్కువ వస్తుంది. ప్రస్తుతం పెట్రోల్‌ రేటు ప్రకారం 200 ఎంఎల్‌ విలువ రూ.24 అవుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.3.36 కోట్ల వాహనచోదకుల జేబులకు చిల్లుపడుతున్నట్లు అంచనా.

తనిఖీలు నిర్వహిస్తున్నాం 
జిల్లాలోని పెట్రోలు బంక్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చినప్పుడుతో పాటు ఏడాదిలో సాధారణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొలతల్లో తేడాలు వచ్చినా, టైంకు సీలింగ్‌ వేయించకున్నా కేసులు నమోదు చేసి జరిమానా విధించి వసూళ్లు చేస్తున్నాం. గతేడాదిలో 35 కేసులు నమోదు చేసి అపరాధ రుసుం రాబట్టాం.  రెండు రోజుల క్రితం అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌బ్రిడ్జి వద్ద ఉన్న పెట్రోలు బంకులో మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వెళ్లి విచారణ చేపట్టాం. వారిపై చర్యలు తీసుకుంటాం.  
– రవిథామస్, తూనికలు, కొలతలశాఖ ఉన్నతాధికారి నెల్లూరు  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top