ఇల్లు ఖాళీ చేయాలన్న అధికారులు.. గుండెపోటుతో భూ నిర్వాసితుని మృతి

Official Notice House BN Thimmapur Resident Died Heart Attack - Sakshi

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామమైన బీఎన్‌ తిమ్మాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న తమ భూములు, ఇళ్లకు పరిహారం ఇవ్వాలని బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామ భూ నిర్వాసితులు 58 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇదేమీ పట్టించుకోకుండా ఈ నెల 24న రెవెన్యూ అధికారులు వారికి ఇళ్లు ఖాళీచేయాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు.

దీంతో పరిహారం ఇవ్వకుండా.. ఇల్లు ఖాళీచేయమంటున్నారని మనస్తాపం చెందిన జూపల్లి నర్సింహ(46 ) అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మృతునికి చెందిన అర ఎకరం భూమి రిజర్వాయర్‌ ముంపు కింద పోతుండడంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా
గ్రామస్తులంతా నర్సింహ మృతదేహంతో కలె క్టర్‌ కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు మాసు కుంట వద్ద హైదరాబాద్‌–వరంగల్‌ రోడ్డుపై ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు వీరి ఆందోళన కొనసాగింది.

ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్తుల వద్దకు చేరుకుని.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారదా అంజనేయులు, సర్పంచ్‌ లతరాజు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top