పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు

Malnutrition In Children 1-20 Lakh People Identified In Telangana - Sakshi

మొత్తం 12.18 లక్షల మంది పిల్లలకు న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు 

సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌ కింద 4.92 లక్షల మంది తల్లుల నమోదు

మహిళల్లో 57%, పురుషుల్లో 15% మందికి రక్తహీనత

తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ –2022 వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మొత్తం 1.20 లక్షల మందిలో పోషకాహార లోపం ఉందని తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ (గణాంక నివేదిక)–2022 వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 19.79 లక్షల మంది పిల్లలు ఉంటే, అందులో 6.09 శాతం మంది పోషకాహార (న్యూట్రిషన్‌) లోపంతో బాధపడుతున్నారు. 1.83 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. 

కాగా 12.18 లక్షల మంది పిల్లలు న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు (అదనపు పోషకాలు) తీసుకుంటున్నారు. అత్యధి కంగా సిద్దిపేట జిల్లాలో 78.4 శాతం మంది పిల్లలు సప్లిమెంటరీలు తీసుకుంటుండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 20.9 శాతం మంది తీసుకుంటున్నారు.2021–22 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4.92 లక్షల మంది తల్లులు సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌ కింద నమోదయ్యారు. అందులో 2.58 లక్షల మంది న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు తీసుకునేవారిలో అత్యధికంగా జగిత్యాలలో 62.9 శాతం మంది ఉండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 26.9 శాతం మంది ఉన్నారు. 

97,448 మందికి కేసీఆర్‌ కిట్‌...
రాష్ట్రంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి 97,448 మందికి కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకం 2017 జూన్‌ రెండో తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మాతృత్వ, శిశు మరణాల రేటును తగ్గించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడిపిల్ల పుడితే రూ.13 వేలు తల్లులకు అందజేస్తున్నారు. అలాగే టవళ్లు, సబ్బులు, పౌడర్‌తో కూడిన కిట్‌ను కూడా ఇస్తున్నారు.  

నివేదికలోని ముఖ్యాంశాలు...
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (ఎన్‌ఎఫ్‌ హెచ్‌ఎస్‌–5) ప్రకారం రాష్ట్రంలో 6–59 నెలల మధ్య చిన్నారుల్లో 70 శాతం మంది రక్తహీన తతో బాధపడుతున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం అది 60.7 శాతంగా ఉంది. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం రాష్ట్రంలో 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల గర్భిణుల్లో 53.2 శాతం మందిలో రక్తహీనత నమోదయ్యింది. 
అన్ని కేటగిరీలకు చెందిన 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 57.6 శాతం మంది, పురుషుల్లో 15.3 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 
మహిళల్లో అత్యంత తీవ్రమైన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ఉన్నవారు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం 3.9 శాతం మంది ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం 7 శాతం ఉన్నారు. 
పురుషుల్లో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం అత్యంత తీవ్రమైన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ఉన్నవారు 4.1 శాతం ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం రెట్టింపునకు పైగా 9.3 శాతం ఉన్నారు. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం మహిళల్లో మధ్యస్తం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 1.7 శాతం ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం ఏకంగా 6.3 శాతం ఉన్నారు. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం పురుషుల్లో మధ్యస్థం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 3.5 శాతం ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం 8.1 శాతం ఉన్నారు. 
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 1.33 లక్షల మంది ఉన్నారు.
చదవండి: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top