ఒక క్లిక్‌తో డబ్బులు అని ఆశపడితే.. మీ చరిత్ర మొత్తం వారి చేతుల్లోకి..

Nellore SP Vijaya rao Alert to People Over instant loan apps - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): ఇన్‌స్టంట్‌ లోన్‌యాప్‌ల విషయలో అప్రమత్తంగా ఉండాలని.. లేని పక్షంలో అనర్థాలు తప్పవని ఎస్పీ సీహెచ్‌ విజయారావు ప్రజలకు సూచించారు. శనివారం ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో లోన్‌యాప్‌ల మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అత్యవసరాల నిమిత్తం ఇన్‌స్ట్టంట్‌ లోన్‌యాప్‌లో నగదు తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక క్లిక్‌తో డబ్బులు వస్తాయని ఆశపడితే ఆపై నిర్వాహకులు వేధింపులకు గురి చేయడమే కాకుండా అంతకు అంత నగదు వసూళ్లు చేస్తున్నారన్నారు. లోన్‌యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న మరుక్షణం నేరగాళ్లు మీ మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారంతో పాటు వాట్సాప్, గ్యాలరీలోని ఫొటోలను హ్యాక్‌ చేస్తారన్నారు. చిన్న మొత్తంలో నగదు ఇచ్చి పెద్ద మొత్తంలో కట్టాలని ఒత్తిడి తీసుకువస్తారన్నారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్పీ తదితరులు

కట్టని పక్షంలో మీ ఫొటోలను, వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి బంధువులకు, సన్నిహితులకు పంపుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్నారు. కొందరు లోన్‌యాప్‌ నిర్వాహకుల ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఫోన్‌ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించిన ఆప్షన్లను నియంత్రించుకుంటే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లకుండా ఉంటుందన్నారు. లోన్‌ తీసుకునేవారు ఆ యాప్‌కు ఆర్‌బీఐ గుర్తింపు ఉందో లేదో చూడాలన్నారు. ప్రజలు రుణాలు అవసరమైతే బ్యాంకు లేదా తెలిసిన వారి ద్వారా నగదు తీసుకోవడం మంచిదన్నారు.

లోన్‌యాప్‌ల ద్వారా మోసపోతే  పోలీసు స్టేషన్‌లో లేదా, 1930, సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు డి. హిమవతి, శ్రీనివాసరావు, ఎస్‌బీ, నెల్లూరు నగర ఇన్‌చార్జ్‌ డీఎస్పీ కోటారెడ్డి, అబ్దుల్‌ సుబహాన్, నెల్లూరు నగర ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, టీవీ సుబ్బారావు, అన్వర్‌బాషా, దశరథరామారావు, నరసింహరావు, మధుబాబు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top