వరంగల్‌లో పరువు హత్య.. అంజలి ప్రేమవ్యవహారం నచ్చక..

Mother Who Murdered Daughter to be Dishonored Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ క్రైం/పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఉబ్బని అంజలి ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మృతురాలి తల్లి, అమ్మమ్మలు తమ మాట వినడం లేదని హత్య చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో పర్వతగిరి పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాలను ఈస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటలక్ష్మి వివరించారు. మృతురాలు ఉబ్బని అంజలి తల్లి సమ్మక్క భర్త చనిపోవడంతో జీవనోపాధి కోసం పర్వతగిరిలో కూరగాయల వ్యాపారం కొనసాగిస్తుంది.

సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె వివాహం జరిగింది. రెండో కుమార్తె అంజలి తల్లి వద్ద ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఇదే క్రమంలో అంజలి అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం తల్లికి తెలియడంతో పాటు తమ కులానికి చెందిన వ్యక్తికాకపోవడంతో అంజలి ప్రేమను అంగీకరించలేదు. ప్రశాంత్‌తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించవద్దని నిందితురాళ్లు తల్లి, అమ్మమ్మలు మృతురాలిని పలుమార్లు హెచ్చరించారు.

చదవండి: (విషాదం: 'నాకు అక్కడ చదవడం ఇష్టం లేదు.. ప్రైవేట్‌ కాలేజీకి పంపండి')

అయినా అంజలి వ్యవహారక శైలిలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా అంజలిని చంపాలని సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే గత నెల(నవంబర్‌) 19న అర్ధరాత్రి 3గంటల సమయంలో నిద్రిస్తున్న అంజలిని తల్లి గొంతు నులుమగా, అమ్మమ్మ అంజలి ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు ఇద్దరు ఇంటి నుంచి బయటికి వచ్చి చుట్టుపక్కల వారికి వినబడే విధంగా గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ తమ కుమార్తె ఏదో మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అరిచారు. దీంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు పర్వతగిరి పోలీసులకు సమాచారం అందించారు.

చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..)

మృతురాలి తల్లి, అమ్మమ్మతో పాటు చుట్టు పక్కల వారు ఇచ్చిన వాంగ్మూలంతో పర్వతగిరి పోలీసులు అంజలిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతిపై మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ పర్యవేక్షణలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి మృతురాలి తల్లి, అమ్మమ్మలను విచారించడంతో తామే హత్యచేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ నేరాన్ని నిరూపించడంలో ప్రతిభ కనబర్చిన మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్, పర్వతగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్, ఐనవోలు, సంగెం, ఎస్సైలు భరత్, హరిత, కానిస్టేబుళ్లు రాజు, లింగమూర్తి, మహిళా కానిస్టేబుల్‌ విజయలను సీపీ తరుణ్‌ జోషి అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top