భర్త చనిపోవడం, ఇద్దరు కొడుకులు జైలుకెళ్లడంతో.. తల్లి ఆత్మహత్య 

Mother Suicide Over Her Two Sons Went Jail In Ranga Reddy - Sakshi

సాక్షి, మీర్‌పేట: పక్కింటి వారితో జరిగిన గొడవలో ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి వాటర్‌ ట్యాంక్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొగుళ్లవంపు గ్రామానికి చెందిన బిట్టు జంగమ్మ(52) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తన ఇద్దరు కుమారులు, కుమార్తెను తీసుకుని బతుకుదెరువు కోసం 7 ఏళ్ల క్రితం మీర్‌పేట లెనిన్‌నగర్‌ మురళీకృష్ణనగర్‌లో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయిస్తుండగా, పెద్ద కుమారుడు మహేష్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్, చిన్న కుమారుడు మధు మెకానిక్‌ పనిచేస్తున్నాడు.
చదవండి: ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య 

జంగమ్మ ఇంటిని నిర్మిస్తున్నప్పటి నుంచి పక్కింటికి చెందిన సంగం సుజాతతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 18న ఇంటి ఆవరణలోకి నీరు వచ్చాయనే కారణంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో జంగమ్మ కుమారులు మహేష్‌, మధు సుజాతపై దాడి చేశారు. తనను అవమానపరిచేలా దుస్తులను చించివేశారని ఆరోపిస్తూ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవలో జంగమ్మ చెవికి కూడా రక్తగాయాలు అయ్యాయి. ఎస్‌ఐ బద్యానాయక్‌ విచారణ జరిపి మహేష్, మధును అరెస్ట్‌ చేసి 20న తేదీ రిమాండ్‌కు తరలించారు.
చదవండి: తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి..

భర్త చనిపోవడం, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లడంతో జంగమ్మ తీవ్ర మనోవేదనకు గురైందని స్థానికులు చెప్పారు. కుమారులను రిమాండ్‌కు తరలిస్తుండగా బెయిలు ఇప్పించాలని లాయర్‌ను తీసుకుని ఠాణాకు వెళ్లి పోలీసులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో నిరాశకు గురైంది. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున మీర్‌పేట రైతుబజార్‌ సమీపంలోని మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గొడవకు సంబంధించి సంగం సుజాత బంధువులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top