తల్లి మృతిని తట్టుకోలేక.. 

Missing Their Dead Mother Two Brothers End Life In Rampally Dayara - Sakshi

ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

కీసర: తల్లి మృతిని తట్టుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం  గ్రామానికి చెందిన సుశీల భర్త మరో వివాహం చేసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉంటోంది. ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డికి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది.

అప్పటినుంచి ఆయన గండిపేటలో ప్రైవేటు ఉద్యోగంచేస్తూ అక్కడే ఉంటున్నారు. అతని సోదరులు యాదిరెడ్డి(30) మహిపాల్‌రెడ్డి (28) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంగీత పాఠశాలలో పనిచేస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లిసుశీల ఎనిమిది నెలల క్రితం కేన్సర్‌ వ్యాధితో మృతిచెందింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి ఇద్దరు సోదరులు దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లిపోయారు.

యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ఈనెల 21న ఇంటిని శుభ్రం చేసేందుకు రాంపల్లిదాయరకు వచ్చారు. అయితే గండిపేటలో ఉన్న అన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పక్కింటి వారికి ఫోన్‌చేసి చెప్పారు.వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటం, మహిపాల్‌రెడ్డి పురుగు మందుతాగి కిందపడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో మృతులు రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో తమ తల్లి చనిపోవడం తట్టుకోలేక మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top