బాలికను కిడ్నాప్‌ చేసి బిక్షాటన, మాట వినకపోవడంతో

Minor Girl Kidnapped By Tamilnadu Person In West Godavari - Sakshi

సాక్షి, తణుకు: తమిళనాడుకి చెందిన బాలికను అపహరించి ఆమెతో బిక్షాటన చేయిస్తున్న ప్రబుద్ధుడి నిర్వాకం వెలుగుచూసింది. యాచకవృత్తి చేయడానికి నిరాకరించిన బాలికను సైతం గాయపరిచిన అతడిని తణుకు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తణుకు సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురైకు చెందిన సెల్వం అనే వ్యక్తి అదే రాష్ట్రం సాతూర్‌కు చెందిన మేరీదాస్‌ అనే తొమ్మిదేళ్ల బాలికను మూడేళ్ల క్రితం బలవంతంగా ఎత్తుకుని వచ్చాడు. ఆమెతో తిరుపతి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.  

కూతురిగా చెబుతూ.. 
దివ్యాంగుడైన సెల్వం.. మేరీదాస్‌ను తన కూతురిగా పరిచయం చేస్తూ భిక్షాటన చేయిస్తున్నాడు. ఈక్రమంలో నెల రోజుల క్రితం తణుకు తీసుకువచ్చిన సెల్వం తణుకులోని ఉండ్రాజవరం జంక్షన్‌ వద్ద గణేష్‌ సెంటర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 20న భిక్షాటన చేయడానికి మేరీదాస్‌ నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో గాయపడిన చిన్నారి ఏడుస్తూ స్థానిక పాత బెల్లం మార్కెట్‌ వద్ద ఉండటాన్ని గమనించిన లారీ డ్రైవర్లు పోలీసులకు అప్పగించారు. చిన్నారికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు ఆమె చేయి విరగడంతో చికిత్స చేయించి ప్రస్తుతం దెందులూరులోని బాలసదన్‌లో ఉంచారు.

ఇదిలా ఉంటే అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న సెల్వంను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు. నిందితుడు ఇంకా ఎవరినైనా ఇలా తీసుకువచ్చి భిక్షాటన చేయిస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చైతన్యకృష్ణ వెల్లడించారు. కేసులో సహకరించిన ఎస్సైలు కె.రామారావు, డి.రవికుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. 
చదవండి: చికిత్స పొందుతున్న ఏఎస్సై మృతి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top