దేవుడా ఎంత ఘోరం! మిన్నంటిన ఆర్తనాదాలు

Milk Tanker In Front Of Tempo Traveler Behind KSRTC Bus Collided - Sakshi

అర్ధరాత్రి, డ్రైవర్‌ తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మరో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంట్లో ఉంటారు. కానీ విధి మరోలా తలచింది. పాల ట్యాంకర్‌ రాంగ్‌ రూట్లో మృత్యు శకటంలా వచ్చింది. యాత్రికుల టెంపో ట్రావెలర్‌ గమనించేలోపే ఢీ కొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు, మహిళలతో సహా 9 మంది దుర్మరణం చెందారు. దేవుని దర్శనానికి వెళ్లి వస్తుంటే ఎంత దారుణం జరిగింది దేవుడా అని మృతుల బంధువులు విలపించారు.

బనశంకరి: టెంపో ట్రావెలర్‌కు ముందు పాల ట్యాంకర్, వెనుక నుంచి కేఎస్‌ఆర్‌టీసీ బస్‌ తాకిడితో భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోలోని నలుగురు పిల్లలతో పాటు 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్‌ జిల్లా అరసికెరె తాలూకా బాణావర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది.  

ధర్మస్థల, హాసనాంబ దర్శనం చేసుకుని  
వివరాలు.. అరసికెరె తాలూకా బాణవార హొబళి హళ్లికెరె గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది టెంపో ట్రావెలర్‌ వాహనంలో శనివారం ధర్మస్థల క్షేత్రానికి వెళ్లారు. మంజునాథ స్వామికి దర్శించుకుని తరువాత సాయంత్రం హాసన్‌కు బయలుదేరారు. హాసనాంబ మాతను దర్శించుకుని చేసుకుని హళ్లికెరె గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మరో 10 నిమిషాల్లో క్షేమంగా సొంతూరికి చేరుకునేవారు.  

రాంగ్‌ రూట్లో పాల ట్యాంకర్‌  
అరసికెరె–శివమొగ్గ హైవే – 69 బాణావర వద్ద వెళుతుండగా శివమొగ్గ నుంచి చెన్నరాయపట్టణ వైపునకు వస్తున్న పాల ట్యాంకర్‌ డ్రైవరుకు మలుపు తెలియకపోవడంతో టెంపోకి ఎదురుగా వెళ్లాడు. ఈ సమయంలో వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్‌ వాహనం, పాల ట్యాంకర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఆ సమయంలో వెనుక వస్తున్న బెంగళూరు–శివమొగ్గ కేఎస్‌ ఆర్‌టీసీ బస్సు టెంపోను ఢీకొట్టింది. రెండు వైపులా ప్రమాదంతో టెంపోలోని యాత్రికులు విలవిలలాడారు. 

మృతులు వీరే..: తీవ్ర గాయాలతో లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్‌ (10), ధృవ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) అనే 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెంపో, బస్సులోని మరో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో 10 మందిని హాసన్‌ జిల్లాసుపత్రికి, ఇద్దరిని అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుజ్జునుజ్జుకావడంతో క్రేన్‌ సాయంతో వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిలో కేఎస్‌ఆర్‌టీసీ బస్‌ డ్రైవరుతో పాటు ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.   

ట్యాంకర్‌ డ్రైవర్‌ అరెస్టు  
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బాణవార పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాసన జిల్లాఆసుపత్రికి, అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. మతదేహాలకు శవపరీక్షల నిమిత్తం హాసన్‌ జిల్లాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పాలట్యాంకర్‌ డ్రైవరును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.  

హైవే అధికారుల నిర్లక్ష్యమే  
ప్రమాదం విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు జరుగుతుండగా సక్రమంగా సూచిక బోర్డులు అమర్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు విగతజీవులయ్యారని తెలిపారు.  

రూ.2 లక్షల చొప్పున పరిహారం   
మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై ప్రకటించారు. ఈ సంఘటన దురదష్టకరమని సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విపక్ష నేతలు సిద్దరామయ్య, కుమారస్వామిలు కూడా సంతాపం తెలిపారు.

మిన్నంటిన ఆర్తనాదాలు 
దేవునికి కళ్లు లేవు. దేవుని శాపమో, గ్రహచారమో అని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు విలపించారు. ఈ ప్రమాదంలో హళ్లికెరెలో పెద్ద కుటుంబానికి చెందిన 9 మంది మృత్యవాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ప్రమాద స్థలంలో విలేకరులతో మాట్లాడిన మృతుల బంధువు రవికుమార్‌.. అందరూ శుక్రవారం ఇంటి వద్ద పెద్దల పూజ చేసుకుని శనివారం ఉదయం ధర్మస్థలకు వెళ్లారు.

తరువాత హాసనాంబను దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తూ మరణించారని విలపించాడు. ఏ దేవునికి కళ్లు లేవు సార్‌. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబం«దీకులు. నా తమ్ముడు రెండేళ్ల కిందట కోవిడ్‌తో చనిపోయాడు. ఈ రోజు ప్రమాదంలో అతని ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని రోదిస్తూ చెప్పాడు.   

(చదవండి: విజయపురలో పరువు హత్య?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top