బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత

Published Tue, Oct 10 2023 4:54 PM

Massive Hawala Cash Seizure In Banjara Hills Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. తాజాగా, బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, దీనిలో భాగంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ స్పోర్ట్స్ పోలీసులతో పాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారని, రోడ్‌ నెంబర్-3 వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేయగా మూడు కోట్ల 35 లక్షల నగదు పట్టుబడిందని డీసీపీ వెల్లడించారు.

‘‘పట్టుబడిన నగదు హవాలా మనీగా గుర్తించాం.. హనుమంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. హనుమంత్ రెడ్డి సూచన మేరకు ప్రభాకర్, శ్రీ రాములు, ఉదయ్ కుమార్ హవాలా మనీ సేకరిస్తూ ఉంటారు. ఇందుకోసం అరోరా కాలనీలో సాయి కృప బిల్డింగ్ ప్లాట్ నెంబర్ 583 తమ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. సేకరించిన హవాలా డబ్బులు తమ కార్యాలయానికి తీసుకెళ్తుండగా సీజ్ చేశాం. కోటి హవాలా మనీకి 25,000 కమిషన్‌గా తీసుకుంటారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి.. బేగంబజార్, నాంపల్లి, గోషామహల్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో మూడు కోట్ల 35 లక్షలను కలెక్ట్ చేశారు. పట్టుకున్న నగదును కోర్టులకు అప్పగిస్తాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని డీసీపీ పేర్కొన్నారు.

రంగా రెడ్డి జిల్లాలో..
వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పూర్తిస్థాయి విచారణ నిమిత్తం నగదను ఇబ్రహీంపట్నం ఆర్డీవోకి అప్పగించారు. కాగా, ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. 

రాజధాని పరిధిలో... 
సోమవారం.. బషీర్‌బాగ్‌ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్‌ వద్ద బేగంబజార్‌కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్‌నగర్‌కు చెందిన స్క్రాప్‌ వ్యాపారి సంతోష్‌ చంద్రశేఖర్‌ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా లాల్‌పహాడ్‌ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్‌ కేఫ్‌ చౌరస్తాలో షాహీన్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్‌కు చెందిన దినేష్‌ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం. 

షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్‌. 

వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్‌రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం.

గోపాలపురం పీఎస్‌ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు.

పంచశీల క్రాస్‌ రోడ్స్‌ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాధీనం.

Advertisement
 
Advertisement