జీవితాంతం తోడుంటానన్నాడు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని

Married Woman Suspicious Death in Vijayawada - Sakshi

సాక్షి, గుణదల (విజయవాడ తూర్పు): జీవితాంతం తోడుంటానని పెళ్లాడిన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను విస్మరించాడన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మాచ వరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మొగల్రాజపురం ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

మాచవరం సీఐ ప్రభాకర్‌ కథనం మేరకు.. గుంటూరు జిల్లా, యర్రబాలెం ప్రాంతానికి చెందిన భువనగిరి నాగవెంకట అంజన్‌కృష్ణ (30)కు అదే ప్రాంతానికి చెందిన రేణుక శ్రీదేవి (19)తో గత యేడాది నవంబర్‌లో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్ని నెలల క్రితం అంజన్‌కృష్ణ, రేణుకశ్రీదేవి విజయవాడ మొగల్రాజపురం అమ్మకల్యాణ మండపం సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. అదే ప్రాంతంలో సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న అంజన్‌కృష్ణ భార్యను పట్టించుకోకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అంజన్‌కృష్ణ మద్యానికి బానిసై భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు పెద్దల మధ్య పంచాయితీలు జరిగాయి. ఇక పై తన భార్యను ఇబ్బందులకు గురిచేయనని పంచాయితీలో అంజన్‌ కృష్ణ మాటచ్చాడు. కొద్ది రోజులకే వివాహేతర సంబంధం నెరపుతూ, మద్యంతాగడం మొదలు పెట్టాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మరింతగా పెరిగాయి.  చదవండి: (సీఐ గారి రైస్‌మిల్‌ కథ!.. సుప్రియ పేరుతో)

ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన అంజన్‌ కృష్ణ సోమవారం ఉదయం సెల్‌ఫోన్‌షాపు వద్దకు బయలుదేరగా, భారీ వర్షం, బంద్‌ కారణంగా బయటకు వెళ్లొద్దని రేణుక అతడిని వేడుకుంది. అయినా అంజన్‌ కృష్ణ గొడవ పడి వెళిపోయాడు. దీంతో తన భర్త చేయిదాటిపోయాడని, తన జీవితం నాశనమైపోయిందన్న మనస్తాపంతో రేణుక చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అంజన్‌కృష్ణకు తన భార్య ఉరికి వేళాడుతూ కన్పించింది. ఈ సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని  ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  చదవండి: (సైబర్‌ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌ రేప్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top