పెద్దపల్లి: వివాహితపై సామూహిక అత్యాచారం?

Married Woman Molested In Peddapalli Telangana - Sakshi

14 మంది కూలీల నిర్బంధం 

ఇటుకబట్టి యజమానుల దాష్టీకం  

హెచ్‌ఆర్సీకి ఫిర్యాదుతో వెలుగులోకి.. 

పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో ఘటన 

సాక్షి, పెద్దపల్లి: ఇటుక బట్టీలో పనిచేసే ఓ వివాహితపై యజమానులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత నెల 24న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) లేఖ రాయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఆర్సీ నుంచి అధికారులకు అందిన లేఖ ప్రకారం.. గౌరెడ్డిపేటలోని ఎల్‌ఎన్‌సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత (22)పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు.

తమకు ప్రాణహాని ఉందని భావించిన సదరు దంపతులు.. అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే.. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. స్పందించిన హెచ్‌ఆర్సీ.. విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్, ఎస్సై రాజేశ్, తహసీల్దార్‌ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ స్వప్నను సోమవారం ఆదేశించింది. వీరంతా ఇటుక బట్టీల వద్ద కూలీలతో మాట్లాడారు. పదిమంది కూలీలు, వారి పిల్లలకు కేంద్రంలో ఆశ్రయం కల్పించామని కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ స్వప్న తెలిపారు.  

బాధితులను దాచారా? 
అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో బాధితురాలు, ఆమె భర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. దీంతో యజమానులే వారిని దాచిపెట్టి ఉంటారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు యజమానులు సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అత్యాచారం, కూలీల నిర్బంధంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు. కాగా, గతంలో సైతం ఇదే ఇటుక బట్టీలో ఓ కూలీ మృతి చెందగా తోటి కూలీలకు తెలియకుండా యాజమాన్యం దాచి పెట్టిందని పలువురు కూలీలు గుర్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top