ఇంటి ఓనర్‌తో వివాహేతర సంబంధం! సైకో కిల్లర్‌గా మారిన ఆ భర్త..

A Man Murder 3 Women due to his wife having a relationship with another one - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరే వ్యక్తితో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కమీషన్‌ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. నగర శివారు పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన వరుస హత్యలకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు.   

భార్య వివాహేతర బంధంతో కుమిలిపోయి... 
చందక రాంబాబు అలియాస్‌ సందక రాంబాబు (49) కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామ నివాసి. 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అనంతరం 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్‌లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివసించేవారు. 2015లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్‌లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి వద్దే ఉంటున్నారు. 

ఒంటరితనం... స్త్రీలపై పగతో...  
భార్య, పిల్లలకు దూరమైన రాంబాబు ఒంటరిగా మారాడు. 2021 అక్టోబర్‌లో పెందుర్తి సమీప ప్రశాంతినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని నివసించేవాడు. అయితే ఏ పనికీ వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు విడిచి బస్టాప్‌లో ఆశ్రయం పొందాడు. సమీపంలోని ఫంక్షన్‌ హాల్స్, దేవాలయాల వద్ద భోజనం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తన కారణంగా రాంబాబు స్త్రీలపై పగ, ద్వేషం పెంచుకున్నాడు. మహిళలను కొట్టి, దారుణంగా చంపి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక స్క్రాప్‌ దుకాణం నుంచి ఇనుప రాడ్డు దొంగలించాడు. ముందుగా గత నెల 9న పెందుర్తి బృందావన్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో పనిచేస్తున్న 50 ఏళ్ల తోట నల్లమ్మ, ఆమె కుమారుడు నిద్రపోతుండగా దాడి చేసి గాయపరిచాడు. అనంతరం ఈ నెల 6న రాత్రి పెందుర్తి చినముషిడివాడ సప్తగిరినగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుతారి అప్పారావు, సుతారి లక్షి్మపై ఇనుప రాడ్డుతో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఈ నెల 14న రాత్రి పెందుర్తి సుజాతనగర్‌ నాగమల్లి లే అవుట్, లాలం రెసిడెన్సీ సెల్లార్‌లో అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌గా ఉంటున్న అప్పికొండ లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు.  

నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే...  
రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేసినప్పుడు కమీషన్‌ విషయంలో బిల్డర్లు తనను మోసం చేయడంతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే దాడులు, హత్యలకు పాల్పడాలని చందక రాంబాబు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే జన సంచారం తక్కువగా ఉండడం, సరైన భద్రత లేని అపార్టుమెంట్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి హత్యాంకాండకు పాల్పడ్డాడు. దీంతో వరుస హత్యలపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు కోసం పలు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు క్షుణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top