పెళ్లి చేసుకోనందని గొంతు కోశాడు | Man Attacks With Knife On Young Girl In Visakhapatnam | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోనందని గొంతు కోశాడు

Dec 3 2020 5:07 AM | Updated on Dec 3 2020 7:40 AM

Man Attacks With Knife On Young Girl In Visakhapatnam - Sakshi

బుధవారం ఉదయం సుమారు 9 గంటలు. కుళాయి వస్తుండటంతో వీథిలోని వారంతా నీళ్లు పట్టుకుంటున్నారు. ఇంతలో ఓ యువకుడు హడావుడిగా కుళాయికి సమీపంలో ఉన్న ఓ మేడ పైగదిలోకి వెళ్లాడు. కాసేపటికే మెడ చుట్టూ టవల్‌ చుట్టుకుని బయటకు వచ్చాడు. ఆ వెనుకే ఓ యువతి మెడంతా రక్తంతో అమ్మా.. అని అరుచుకుంటూ వచ్చి మెట్లపై పడిపోయింది. నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన యువతి తల్లి, మరికొందరు స్థానికులు పరుగెత్తుకుంటూ యువతి వద్దకు వచ్చారు. వెంటనే ఆమెతో పాటు ఆ యువకుడినీ ఆస్పత్రికి తరలించారు.

సాక్షి, విశాఖపట్నం:  విశాఖ నగరంలో ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. డీసీపీ ఐశ్వర్య రస్తోగి, దిశా పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌ కాజల్, యువతి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. పాత పోస్టాఫీస్‌ థామస్‌ వీధిలో 21 ఏళ్ల యువతి ప్రియాంక, 23 ఏళ్ల యువకుడు శ్రీకాంత్‌ల తల్లిదండ్రులు గత 20 ఏళ్లుగా పక్క పక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఇంటి మరమ్మతుల నేపథ్యంలో కొన్నిరోజులుగా శ్రీకాంత్‌ కుటుంబం దగ్గర్లోనే మరో ఇంట్లో ఉంటోంది. ప్రియాంక డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ.. ఆరు నెలల క్రితం వార్డు వలంటీర్‌గా ఉద్యోగంలో చేరింది. రెండేళ్లుగా శ్రీకాంత్‌ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ప్రియాంకను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులతో చెప్పగా వారు అంగీకరించారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను తరచూ ఒత్తిడి చేస్తున్నాడు.

తాను తల్లిదండ్రుల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని ప్రియాంక స్పష్టం చేసినా.. శ్రీకాంత్‌ వినకపోవడంతో ఆరునెలల క్రితం ఆమె తల్లి మాకిన రమణమ్మ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా బుధవారం ఉదయం కుళాయి వస్తుండటంతో రమణమ్మ ఇంట్లోంచి బయటకు వెళ్లడం గమనించిన శ్రీకాంత్‌ అదే అదనుగా ప్రియాంక ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టాడు. స్టేషనరీ బ్లేడ్‌తో ప్రియాంక గొంతు కోశాడు. ఆ తర్వాత తన మెడను కూడా అదే స్టేషనరీ బ్లేడ్‌తో కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకతో పాటు శ్రీకాంత్‌ను కూడా స్థానికులు, వారి బంధువులు ఆటోలో కేజీహెచ్‌కి తరలించారు. యువతి గొంతు లోతుగా తెగిందని, పరిస్థితి విషమంగా ఉన్నా నిలకడగా ఉందని కేజీహెచ్‌ డాక్టర్‌ సాధన తెలిపారు. శ్రీకాంత్‌ పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఇద్దరినీ శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచామని చెప్పారు.

పథకం ప్రకారమే దాడి చేశాడు
ప్రేమించలేదనే అక్కసుతో తమ కుమార్తెను చంపాలని పథకం ప్రకారమే శ్రీకాంత్‌ దాడి చేశాడని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు. తన కుమార్తె గొంతు కోసి బయటకు వచ్చిన వెంటనే తనను పట్టుకొని.. ‘మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేయనని చెప్పారు కదా.. అందుకే గొంతు కోసేశా..’ అని అన్నట్లు రమణమ్మ తెలిపారు. అయితే స్టేషనరీ బ్లేడ్‌ గదిలోనే ఉందా? అతనే వెంట తీసుకెళ్లాడా అనే విషయం తెలియరాలేదు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై ఐపీసీ సెక్షన్లు 307, 452, 354–ఏ, 354–డీ, 309 కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. దిశా ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారని, కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రియాంక ఉన్న ఇంటిలోకి శ్రీకాంత్‌ వెళ్లిన వెంటనే బయటి నుంచి ఎవరో గడియ పెట్టారని కొంతమంది బంధువులు చెప్పడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement