పక్కా ప్లాన్‌తో.. 3 కుక్కలు, పిల్లి, 30 కోళ్లు సైతం మృతి

Man Assassination Attempt On Wife Younger Sister At Chittoor - Sakshi

తనకిచ్చి వివాహం చేయాలని మంకుపట్టు

మరొకరితో పెళ్లి సంబంధం కుదుర్చడంతో హత్యాయత్నం

అసలే వివాహితుడు..అయినా అతగాడు తన భార్య చెల్లెలిపై కన్నేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించాడు. పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో తన భార్య, కుమారుడిని వదిలేసి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి భార్య చెల్లెలికి తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. ఇది తెలుసుకున్న అతడు ఆమెను కడతేర్చాలని పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. పెళ్లిపీటలెక్కాల్సిన ఆమె ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.

సాక్షి, ములకలచెరువు: తనకిచ్చి పెళ్లి చేయాలని కోరినా ససేమిరా అన్నందుకు ఆగ్రహించిన ఓ మృగాడు తన మరదలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి ఒడిగట్టాడు.  గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన మండలంలోని గట్టుకిందపల్లెలో చోటుచేసుకుంది. సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ రామక్రిష్ణ కథనం.. గ్రామానికి చెందిన కదిరి శివన్న, కదిరి నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె మాధవికి కర్ణాటక రాష్ట్రం బేళూరుకు చెందిన వెంకటేష్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మూడో కుమార్తె కదిరి సుమతి(24) మదనపల్లె ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఎనిమిది నెలల క్రితం వెంకటేష్‌ తనను వివాహం చేసుకోవాలని సుమతిని వేధించాడు. అతడి వేధింపులకు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పట్లో మదనపల్లె పోలీసులు వెంకటేష్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చదవండి: (పనిమనిషిపై మోజు... కటకటాలపాలు)

దీంతో భార్య, కుమారుడిని అత్తగారింట వదిలేసి అతడు కర్ణాటకకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో, సుమతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈ నెల 25న వివాహం చేయాలని ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇది తెలుసుకున్న వెంకటేష్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. తన మరదలిని కడతేర్చాలని నిశ్చయించుకున్నాడు. మంచంపై నిద్రపోతున్న సుమతి(24)పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెట్రోల్‌పోసి నిప్పంటించి పారిపోయాడు. మంటలకు సుమతి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు ఆర్పారు. ముఖం మినహా మిగతా శరీర భాగాలు తీవ్రంగా కాలాయి. 108లో సుమతిని తొలుత తంబళ్లపల్లె పీహెచ్‌సీకి, అనంతరం మదనపల్లె జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐ, గట్టుకిందపల్లెకు వెళ్లి విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ('రమ్యశ్రీని కొట్టి చంపేశారు..')

తొలుత మూగజీవాలపై విష ప్రయోగం
సుమతిని హత్య చేసేందుకు ముందుగా వెంకటేష్‌ పక్కాగా స్కెచ్‌ వేశాడు. ఇంటి వద్ద పెంపుడు కుక్కలు ఉండడంతో అవి తనను చూస్తే అరిస్తే ప్లాన్‌ బెడిసి కొడుతుందనే ఉద్దేశంతో అతడు అన్నంలో విషం కలిపి ఇంటి చుట్టూ వేశాడు. ఆ అన్నం తిని మూడు కుక్కలు, ఒక పిల్లి మృతిచెందాయి. ఉదయం ఆ అన్నం తిన్న మరో 30 కోళ్లు సైతం మృతి చెందాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top