చిన్నారుల హత్య కేసులో నిందితుడి అరెస్టు

Man Arrested In Child Assassination Case - Sakshi

నగరంపాలెం(గుంటూరు): తాడేపల్లి మండలంలోని మెల్లెంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో ఇద్దరు చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని తాడేపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరులో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం మెల్లెంపూడి గ్రామానికి చెందిన కుర్రా భార్గవ్‌తేజ (6) ఈ నెల 14న అదృశ్యం కాగా, మరుసటిరోజు ఇంటికి దగ్గరలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

సహకరిస్తున్నట్టు నటించి.. 
విచారణలో భాగంగా అదే గ్రామానికి చెందిన నిందితుడు మెల్లంపూడి గోపయ్య అలియాస్‌ గోపి (19) ఏమీ తెలియనట్టు పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించి, తప్పుదోవ పట్టించాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గోపి నిందితుడని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. గత నెల 11న వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి అఖిల్‌ (8) కూడా అదృశ్యం కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో పడి ఉంటాడని భావించి విస్తృతంగా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. భార్గవతేజ కేసు తీరులోనే ఇదీ ఉండటంతో పోలీసులు గోపిని విచారించగా, అఖిల్‌ను కూడా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. ఇద్దరినీ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు, అనంతరం గొంతు నులిమి చంపేసినట్టు చెప్పాడు. మృతిచెందిన తర్వాత కూడా మరోసారి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపాడు.
 

కఠిన శిక్ష పడేలా చర్యలు: ఎస్పీ 
దారుణ నేరాలకు పాల్పడిన నిందితుడిపై వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేసి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో అఖిల్‌ మృతదేహం కోసం బకింగ్‌ హామ్‌ కాల్వలో గాలిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా మెల్లెంపూడి గోపిపై అనుమానంతో అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, గ్రామ వీఆర్‌ఓ ద్వారా పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యాడని వెల్లడించారు.

నిందితుడు తన సహచరులతో కలిసి స్వలింగ సంపర్కం చేసేవాడని, వారిని కూడా గుర్తించి సాక్షులుగా చూపుతామన్నారు. ఈ కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన అర్బన్‌ ఏఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ దుర్గప్రసాద్, తాడేపల్లి పీఎస్‌ సీఐలు బి.అంకమ్మరావు, ఎం.సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐలు బాలకృష్ణ, నారాయణ, జైత్యానాయక్, హెచ్‌సీ తిరుమలరావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, కల్యాణ్, సాంబశివరావు, విష్ణుమూర్తిలకు ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు. తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చదవండి:
చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని..

నిన్ను డైరెక్టర్‌ చేస్తా.. ఆపై పెళ్లి చేసుకుంటా    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top