బెడిసికొట్టిన విషప్రయోగం, తల్లి గొంతు నులిమిన కొడుకు

Man Arrested For Assassinated Mother In Khammam - Sakshi

తల్లిని హతమార్చిన తనయుడు

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, భద్రాచలం అర్బన్‌: తల్లిని హతమార్చిన తనయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం పట్టణ సీఐ స్వామి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన యర్రంశెట్టి బసవపార్వతమ్మ(65) పట్టణంలోని ఓంకార్‌ పండ్ల దుకాణంపై నిర్మించిన రేకుల షెడ్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఇద్దరు కుమారులు వెంకటరత్నంనాయుడు, శ్రీనివాసరావులు భద్రాచలంలోనే వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు శ్రీనివాసరావు జామాయిల్‌ కర్ర వ్యాపారం చేసి నష్టపోయాడు.

దీంతో భద్రాచలానికే చెందిన రమేష్‌ అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని నష్టాన్ని పూడ్చుకున్నాడు. కొద్దికాలం తర్వాత అప్పు చెల్లించాలని రమేష్‌ అతనిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో శ్రీనివాసరావు తల్లి వద్దకు వెళ్లి డబ్బులు కావాలని అడిగాడు. ఈ క్రమంలో పార్వతమ్మ తన వాటాకు వచ్చిన భవనాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుల్లో శ్రీనివాసరావుకు రూ.9 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ నగదు తీసుకెళ్లి రమేష్‌కు చెల్లించాడు. తల్లికి మూడు నెలలపాటు వడ్డీ కూడా ఇచ్చాడు. అనంతరం వడ్డీ, అసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు. దీంతో బసవపార్వతమ్మ మందలించగా, తల్లి కూడా అప్పుల బాధను అర్థం చేసుకోకుండా, డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నదని మనస్తాపం చెందాడు.

విషప్రయోగం చేసి హతమార్చేందుకు కుట్ర పన్నాడు. కానీ అది బెడిసికొట్టింది. దీంతో గొంతునులిమి చంపివేశాడు. 2020, డిసెంబర్‌ 23న అర్ధరాత్రి 12:30 గంటలకు తన తల్లి ఇంటికి వెళ్లి, చేతులతో గొంతునొక్కి హతమార్చాడు. తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి దిద్దులు, అప్పునకు సంబంధించిన ప్రాంశరీ నోటు తీసుకుని వెళ్లిపోయాడు. బంగారం బాత్‌రూరంలో దాచి పెట్టి, స్నానం చేసి ఇంట్లో నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మళ్లీ తల్లి ఇంటికి వెళ్లి పరిస్థితిని గమనించి వచ్చాడు. అనంతరం స్థానికులు ఆమె మృతి చెంది ఉన్నట్లు గమనించి శ్రీనివాసరావుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా.. ఏమీ తెలియనట్లే అక్కడకు వెళ్లాడు.

బీపీ, షుగర్‌ ఎక్కువై తల్లి మరణించి ఉంటుందని సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ తల్లి మృతిపై అనుమానంతో పెద్దకుమారుడు వెంకటరత్నం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీం సేకరించిన వివరాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సహజ మరణం పొందినట్లు నివేదిక ఇవ్వాలని తల్లి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ను బెదిరించిన విషయం పోలీసులకు తెలిసింది. దీంతో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతన్ని నుంచి బంగారం, స్కూటీనీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ స్వామి తెలిపారు.

చదవండి: 9 మంది భార్యలున్న వ్యక్తిపై కుమారుడి దాడి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top