దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! విచారణలో కీలక విషయాలు | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! పరారీలోనే సల్మాన్‌.. విచారణలో కీలక విషయాలు..  

Published Thu, May 11 2023 4:12 AM

Key issues in the trial of terrorists caught in Bhopal and Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు బయటపడింది. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు వారు సిద్ధపడ్డట్లు తెలియవచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో పట్టుకున్న ఐదుగురినీ ఏటీఎస్‌ అధికారులు బుధవారం భోపాల్‌ కోర్టులో హాజరుపరిచారు.

న్యాయస్థానం వారిని ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ కోసం ఏటీఎస్‌తోపాటు రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు అతడి ఆచూకీ లభించలేదు. భోపాల్, హైదరాబాద్‌లలో ఇప్పటివరకు అరెస్టయిన 16 మంది విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... 

టాస్క్ లు ఇవ్వకపోవడంతో... 
భోపాల్‌లోని షాజహానాబాద్‌కు చెందిన యాసిర్‌ ఖాన్‌ నేతృత్వంలో 2018లో ఈ మాడ్యూల్‌ ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారితో మతమార్పిళ్లు చేయించి యాసిర్‌ వారిని ఉగ్రవాద బాట పట్టించాడు. అతడి మాడ్యూల్‌లోని వారిలో 90 శాతం ఇలాంటి వాళ్లేనని నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిర్‌ తొలినాళ్లలో హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్‌ (హెచ్‌యూటీ) సంస్థలో పనిచేశాడు. మొదట్లో ఐసిస్‌కు అనుబంధంగా పనిచేసిన ఆ సంస్థ ఆపై దాన్నే విమర్శించింది.

విదేశాల్లోని హెచ్‌యూటీ కేడర్‌తో యాసిర్‌ రాకెట్‌ చాట్‌తోపాటు త్రీమా యాప్‌ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎన్నాళ్లు నిరీక్షించినా ఎలాంటి టాస్‌్కలు ఇవ్వకపోవడంతో ఆ సంస్థకు దూరమై మహ్మద్‌ సలీంగా మారిన సౌరభ్‌రాజ్‌ విద్యతో కలసి సొంతంగా మాడ్యూల్‌ తయారు చేయడం మొదలెట్టాడు. ఆ పని మీదే సలీంను హైదరాబాద్‌ పంపి కొందరిని ఉగ్రబాట పట్టించడంతోపాటు మరో ముఠా తయారయ్యేలా ప్రేరేపించాడు. వాటికి హెచ్‌యూటీ (భోపాల్‌), హెచ్‌యూటీ (హైదరాబాద్‌) పేర్లు పెట్టుకున్నారు.
 
ఎప్పుడైనా దాడులకు సిద్ధంగా ఉండేలా... 
టార్గెట్‌ కిల్లింగ్స్‌గా పిలిచే ఎంపిక చేసుకున్న వారిని హత్య చేయడం, తద్వారా మత కలహాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకున్న యాసిర్, సలీంలు ఆ పంథాలోనే సిద్ధమవుతున్నారు. దేహదారుఢ్యంతోపాటు తుపాకులు కాల్చడం, కత్తులు, గొడ్డళ్ల వినియోగంపై దృష్టి పెట్టారు.

పెల్లెట్స్‌తో పనిచేసే ఎయిర్‌ పిస్టల్స్‌ వాడకంపై అనంతగిరి అడవుల్లో, నాటు తుపాకులు కాల్చడంపై భోపాల్‌ సరిహద్దుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రాక్టీస్‌ చేశారు. అటు యాసిర్‌ ఇంట్లో, ఇటు హైదరాబాద్‌లోని ఐదుగురి ఇళ్లలో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఏడాదిన్నరగా ఈ శిక్షణ పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.  

32 గంటల వరకు ఏమీ ముట్టకుండా... 
టార్గెట్‌ కిల్లింగ్స్‌తోపాటు కిడ్నాప్‌లు, మాల్స్, సినిమా హాళ్లను అదీనంలోకి తీసుకోవడమూ వారి పథకాల్లో భాగమే. హోస్టేజ్‌గా పిలిచే అలాంటి సందర్భాల్లో నిర్భంధంలోని వారికి అన్నీ అందించినా... ఉగ్రవాదులు సైతం కొన్ని గంటలపాటు నీళ్లు, ఆహారం లేకుండా ఉండాల్సి వస్తుంది. పోలీసులు లేదా భద్రతా బలగాలు నీళ్లు, ఆహారంలో మత్తుమందు కలిపి తమను పట్టుకొనే ఆస్కారం ఉందని ఉగ్రవాదులు ఏమీ ముట్టకుండా ఉంటారు.

ఇలా గరిష్టంగా 48 గంటల వరకు మాడ్యూల్‌లోని వారంతా ఏమీ తీసుకోకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలని యాసిర్‌ నుంచి సలీంకు ఆదేశాలు అందాయి. ఈ సర్వైవల్‌ టెక్నిక్స్‌తోపాటు పర్వతారోహణను ముష్కరులు అనంతగిరి అడవుల్లో ప్రాక్టీస్‌ చేసినట్లు బయటపడింది. గరిష్టంగా 32 గంటల వరకు ఏమీ తీసుకోకున్నా జీవించేలా హైదరాబాద్‌ గ్యాంగ్‌ సిద్ధమైంది. రెండు నెలల క్రితం తన ఇంటికి వచ్చిన యాసిర్‌కు సలీం ఈ వీడియోలను చూపించాడు. 

పక్కింటి వాళ్లు ఫోన్‌ చేయడంతో... 
ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్‌ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌తోపాటు భోపాల్‌లోనూ మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలో ఐదుగురు చిక్కారు. నగరానికి చెందిన మహ్మద్‌ సలీం, అబ్దుర్‌ రెహ్మాన్, మహ్మద్‌ అబ్బాస్‌ అలీ, షేక్‌ జునైద్, మహ్మద్‌ హమీద్‌లతోపాటు జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ను కూడా పట్టుకోవాల్సి ఉంది.

అయితే పోలీసుల దాడి సమయంలో అతడు పాల ప్యాకెట్ల కోసం బయటకు వెళ్లాడు. అయితే పోలీసుల రాకను పక్కింటి వాళ్లు ఫోన్‌ చేసి చెప్పడంతో సల్మాన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు బుధవారం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించగా అరెస్టయిన ఉగ్రవాదులతోపాటు వారి భార్యలూ మతమారి్పడి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. 

Advertisement
Advertisement