అక్క కూతురుతో పెళ్లి.. భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో 

Karnataka: Young Woman Assassinated Husband With Help Of Lover Yelahanka - Sakshi

సాక్షి, బెంగళూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ యువతి తాళికట్టిన భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన బెంగళూరు యలహంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది.  శుక్రవారం రాత్రి యలహంకలోని కొండప్ప లేఔట్లో ఓ మేడపై చంద్రశేఖర్‌ (35) అనే నేత కార్మికుడు తల, మర్మావయవాలపై తీవ్ర గాయాలతో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్య ప్రమేయముందని వెల్లడైంది. దీంతో భార్య శ్వేత (19), ఆమె ప్రియుడు సురేశ్‌ (22)ని బుధవారం అరెస్ట్‌ చేశారు.  

నాలుగేళ్ల కిందట అక్క కూతురితో పెళ్లి  
వివరాలు.. శ్వేత, చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరిది పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్వస్థలం కాగా, అక్కడే నేత పని చేసేవారు. చంద్రశేఖర్‌ కంటే శ్వేత 16 ఏళ్ల చిన్నది. కానీ అక్క కుమార్తె అనే కారణంతో కుటుంబసభ్యులు ఇద్దరికీ బలవంతంగా వివాహం చేశారు. పెళ్లయిన తరువాత శ్వేత చదువుకోవడానికి హిందూపురంలో కాలేజీకి వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని భర్త తరచూ గొడవపడేవాడు.  

హిందూపురం నుంచి యలహంకకు  
దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యలహంక కొండప్పలేఔట్‌ లో ఉండాలని ఇక్కడకు పంపించారు. శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్‌ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఆమె భర్తకు తెలియకుండా ఈ తతంగం సాగుతోంది. చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు.  

హత్యకు కుట్ర  
శ్వేత, సురేశ్‌ కలిసి తమకు అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌ను తొలగించుకోవాలనుకున్నారు. సురేశ్‌ 22వ తేదీన బెంగళూరుకు వచ్చాడు. చంద్రశేఖర్‌ ఇంట్లోనే ఉన్నాడని, ఇదే సరైన సమయమని శ్వేత ఫోన్‌ చేసింది. సురేశ్‌ వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. సురేశ్‌ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్‌ తలపై దాడిచేశాడు.   చంద్రశేఖర్‌ రక్తస్రావంతో కిందపడిపోయాడు. ఇదే సమయంలో మర్మావయవాలపై పొడిచి చంపి అక్కడి నుంచి ఉడాయించాడు.  

విచారణలో అసలు నిజం  
సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేకుండా చెప్పింది. ఆమెపై అనుమానంతో పోలీస్‌స్టేషన్‌ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నోరువిప్పింది. పోలీసులు ముమ్మర గాలింపు జరిపి పరారీలో ఉన్న సురేశ్‌ను కూడా అరెస్ట్‌ చేసి కేసు విచారణ చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top