నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు | Kakinada Bhairavapalem Boat Fire Accident, 11 Fishermen Rescued By Coast Guards - Sakshi
Sakshi News home page

Kakinada Boat Fire Accident: నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు

Published Sat, Dec 2 2023 5:01 AM

Kakinada Bhairavapalem Boat Fire Accident  - Sakshi

కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు.

తక్షణమే లైఫ్‌ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్‌.

ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్‌ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్‌గార్డ్‌ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు.

భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్‌ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్‌ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్‌పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి.

 ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు.  రిలయన్స్‌ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు.  కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్‌ చార్లీ–438 ఫిప్‌ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్‌గార్డ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ విశ్వాస్‌ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్‌గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మృత్యుంజయులు వీరే...
బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు 

 
Advertisement
 
Advertisement