కోట్ల రూపాయలు ప్రైజ్‌ మనీ.. క్లిక్‌ చేసి బుక్కయ్యింది!

International Criminal Arrested In Prize Money Cheating Case - Sakshi

రూ.2.50 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చిందంటూ మెసేజ్‌ 

ఆశతో రూ.లక్షలు సమర్పించి మోసపోయిన డ్వాక్రా సంఘమిత్ర

నిందితుడు.. అంతర్జాతీయ నేరగాడు నికోలస్‌ అరెస్ట్‌

ఢిల్లీ వెళ్లి చాకచక్యంగా పట్టుకున్న నగరి పోలీసులు

నగరి(చిత్తూరు జిల్లా): కోట్ల రూపాయలు ప్రైజ్‌ మనీ వచ్చిందంటూ అమాయకులకు వలవేసి రూ.లక్షలకు లక్షలు కాజేసే నైజీరియన్‌ను చిత్తూరు జిల్లా నగరి సీఐ మద్దయ్య ఆచారి శనివారం ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘమిత్ర రక్షింద (28)కు ఏడు నెలల క్రితం రూ.2.50 కోట్ల ప్రైజ్‌ తగిలిందని మెసేజ్‌ వచ్చింది. వివరాలకు క్లిక్‌ చేయండని ఓ లింక్‌ వచ్చింది. ఆశతో క్లిక్‌ చేయగా ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడాడు. కోవిడ్‌ సమయంలో సేవలకు గాను శాంసంగ్‌ ఎలక్ట్రానిక్‌ యూకే కంపెనీ ఆమెను ఎంపిక చేసిందని హిందీలో చెప్పాడు. ప్రైజ్‌ మనీ రావాలంటే.. రూ.3,500 చెల్లించాలన్నాడు.

రూ.కోట్లు వస్తాయన్న ఆశతో ఆ మొత్తాన్ని ఆమె చెల్లించింది. రెండు రోజుల తరువాత ఫోన్‌ చేసిన ప్రైజ్‌మనీ తేవడంలో సమస్యలున్నాయని.. దానిని పరిష్కరించడానికి ఒక రోజులోపు రూ.15,500 చెల్లించాలని.. లేకుంటే డబ్బులు రావన్నాడు. దీంతో రక్షింద ఆ మొత్తం కూడా చెల్లించింది. ఫారిన్‌ కరెన్సీని ఇండియన్‌ కరెన్సీగా మార్చడానికి సొమ్ము చెల్లించాలని, ఆర్బీఐ క్లియరెన్స్‌ అనీ, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ అనీ, డబ్బులు తెచ్చే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో సమస్య ఉందని, హైదరాబాద్‌లో సమస్య ఎదురైందని, తిరుపతి ఎయిర్‌ పోర్టులో అనుమతించలేదని, భాకరాపేటలో పోలీసులు అనుమతించడం లేదని ఇలా పలు కారణాలు చెబుతూ పలు దఫాలుగా వెంటనే డబ్బు పంపాలనడంతో అమాయకత్వం, అత్యాశతో రక్షింద సొమ్ము చెల్లించేది. ఇలా బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి సుమారు రూ.14 లక్షల వరకు చెల్లించింది. డబ్బు చెల్లించినా ప్రైజ్‌ మనీ రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

సాంకేతికతతో ఛేదించిన పోలీసులు 
ఆమెకు వచ్చిన మెసేజిలు, ఫోన్‌కాల్స్‌ను ఆధారం చేసుకుని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెట్టారు. మోసగాడు ఢిల్లీలో ఉంటున్నట్టు గుర్తించి.. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లింది. నైజీరియన్‌ నివాసాన్ని కనుగొని అక్కడి పోలీసుల సహకారంతో అతడి ఇంటికి చేరుకున్నారు. నేరస్తుడు ఇనుప గేట్లు వేసుకొని ఇంట్లో దాక్కోవడంతో గ్యాస్‌ కట్టర్‌ సాయంతో వాటిని కట్‌చేసి నైజీరియన్‌ను పట్టుకున్నారు. నిందితుడు నైజీరియాకు చెందిన అంతర్జాతీయ నేరస్తుడు నికోలస్‌ మగ్లర్‌ అలియాస్‌ జార్జిగా తేలింది. అతడు 2015లో నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చి.. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇలా మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఈ విధంగా సుమారు 90 మంది నుంచి నగదు కాజేసినట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుణ్ణి తీసుకుని శనివారం రాత్రి ఢిల్లీ నుంచి నగరికి బయలుదేరారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top