జైలులో స్నేహం.. కథ మొదలైంది అక్కడినుంచే!

Inter State Robbery Gang Arrest Karimnagar Police Telangana - Sakshi

మార్చి 6న పూడూరు..  10న ఉట్నూరు డీజీబీలో దొంగతనం

పూడూరు బ్యాంకు దోపిడీ కేసులో ఒకరి అరెస్టు 

పరారీలో మరో నలుగురు

సాక్షి,మల్యాల(చొప్పదండి): జైలులో ఇద్దరు నిందితుల మధ్య స్నేహం చోరీలకు బీజం వేసింది. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరూ.. మరో ముగ్గురితో కలిసి అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడ్డారు. వాట్సప్‌ కాల్‌ మాట్లాడుతూ చోరీలకు స్కెచ్‌ వేసేవారు.. ఉత్తర తెలంగాణలోని పలు బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డారు. 

6న పూడురు బ్యాంకులో..
కర్ణాటకలోని సూళ్లపేట బ్యాంకులో 2017లో జరిగిన దోపిడీ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫహీంఖాన్, 2019లో గుల్బర్గాకు చెందిన జాలేంద్రనాథ్‌ ఒక హత్య కేసులో సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. వారి మధ్య స్నేహం కుదిరింది. జైలు నుంచి విడుదలయ్యాక ముఠాగా ఏర్పడి కొత్తగూడెం, ములుగు, పూడూరు, జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాలలోని బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 6న జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులోని ప్యాక్స్‌ బ్యాంకులో, 10న ఉట్నూరు దక్కన్‌ గ్రామీణ బ్యాంకులో చోరీ చేసి మహారాష్ట్రలోని లాథూర్‌కు పారిపోయారు. 

ఒకరు అరెస్ట్‌.. పరారీలో నలుగురు..
పూడూరు ప్యాక్స్‌ బ్యాంకు దోపిడీ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. మల్యాల సీఐ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన కాలేవ జాలేంద్రనాథ్‌ను శనివారం అరెస్టు చేశామని, ఫహీంఖాన్, ఘోరాఖాన్, వహీద్‌ఖాన్, రాజరాము పరారీలో ఉన్నారని తెలిపారు. చోరీలు చేసేందుకు గుల్బార్గా నుంచి జాలేంద్రనాథ్, ఉత్తరప్రదేశ్‌ నుంచి మిగిలిన నలుగురు బయలుదేరి కరీంనగర్‌లో కలుసుకున్నారని వివరించారు. కరీంనగర్‌ నుంచి జగిత్యాల వెళ్తుండగా పూడూరు ప్యాక్స్‌ బ్యాంకు వెనకకు వెళ్లి, తాళాలు పగులగొట్టారని, వెంట తెచ్చుకున్న ఆక్సిజన్‌ సిలిండర్, గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ను తెరిచి రూ.2,20,800 నగదుతో పారిపోయారని వెల్లడించారు. మరోసారి చోరీకి వెళ్తున్నామని ఏ–5(జాలేంద్రనాథ్‌)ను మిగిలిన నలుగురు అడుగగా, జాలేంద్రనాథ్‌ ఈనెల 19న జేఎన్‌టీయూ చెక్‌పోస్టు వద్దకు వచ్చి, మిగిలిన వారికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ రూపేశ్, డీఎస్పీ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి, కొడిమ్యాల ఎస్సై కె.వెంకట్‌రావు, కానిస్టేబుళ్లు బృందాలుగా ఏర్పడి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top