ఓటర్లపైనా రౌడీషీట్లు! | Illegal cases against YSRCP leaders | Sakshi
Sakshi News home page

ఓటర్లపైనా రౌడీషీట్లు!

Jun 3 2024 4:17 AM | Updated on Jun 3 2024 4:17 AM

Illegal cases against YSRCP leaders

దర్శి పోలీసుల దారుణాలు   

వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్లపై కూడా..    

ఐజీ వచ్చి వెళ్లాకే వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు 

బూత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన టీడీపీ వారిపై కేసుల్లేవు  

ఈవీఎంలు పగులగొట్టి, వాటిని ఎత్తుకెళ్లేందుకు యత్నించినా వారిపై చర్యలు శూన్యం

దర్శి: నిన్నటి వరకూ వారిపై ఎలాంటి కేసులూ లేవు.. అయితే ఒక్కసారిగా వారిపై రౌడీఓటర్లపైనా రౌడీషీట్లు ఓపెన్‌ అయ్యాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఎనిమిది మందిపై. అందులో ముగ్గురు వైఎస్సార్‌సీపీకి చెందిన బూత్‌ ఏజెంట్లు. మరో ముగ్గురు ఓట్లు వేసేందుకు వచ్చిన వారు. వారికి ఎలాంటి క్రిమినల్‌ చరిత్ర లేదు. పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేసిన వారిపై నామమాత్రం కేసులు పెట్టి చేతులు దులుపుకున్న దర్శి పోలీసులు.. వీరిపై ఎందుకు రౌడీషీట్‌ పెట్టారో అర్థంకాని విషయం. 

వాస్తవానికి ఎవరిపైనైనా రౌడీషీట్‌ తెరవా­లంటే మూడు క్రిమినల్‌ కేసులు తప్పనిసరిగా ఉండాలి. కనీసం 307 కేసైనా అయి ఉండాలి. లేదా తరచూ నేరాలు చేసేవారి పైరౌడీషీట్‌ వేస్తారు. కానీ ఎలాంటి కేసులు లేని సామాన్యులపై వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అనే నెపంతో రౌడీషీట్లు తెరిచిన దర్శి పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇటీవల ఐజీ సర్వశ్రేష్ట త్రిపా­ఠి దర్శి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెళ్లారు. ఆయ­న వెళ్లాక పోలీసులు రౌడీషీట్లు ఓపెన్‌ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలింగ్‌ రోజు ఏం జరిగిందంటే.. 

టీడీపీ అరాచకం సృష్టిస్తున్నా.. 
అడ్డుకోని పోలీసులు  ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు దర్శి పట్టణంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలోని 117, 118 బూత్‌లలోకి సాయంత్రం ఆరు గంటలు దాటాక టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్‌ సాగర్‌లతో పాటు అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు, తమ్ముడు గొట్టిపాటి భరత్‌లతో పాటు మరో 50 మంది నరసరావుపేటకు చెందిన వారు బూత్‌లోకి ఎగబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసు సిబ్బంది తోపాటు ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలు కూడా అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 

6 గంటలు దాటాక బూత్‌లోకి రావడంపై ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా పోలీసులు నోరు మెదపలేదు. దీంతో అక్కడ ఓటర్లుగా ఉన్నవారు, ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా వారిని అడ్డుకున్నారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ ఊరుకున్నారే గానీ వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. అంతే కాకుండా అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు.. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి నానా రభస చేసినా వారిని బయటకు పంపలేదు. ఏ పోలీసు ఆయన్ను అడ్డుకుని బయటకు పంపేందుకు సాహసం చేయకపోవడం గమనార్హం. 

అదే సమయంలో ఓటు వేసేందుకు లైన్‌లో నిలబడిన వారు సమయం దాటినా ఎందుకు లోపలకు వెళ్తున్నారని వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో గొడవ కాస్త పెద్దదైంది. చోద్యం చూస్తున్న పోలీసులను ఓటర్లు నిలదీయడంతో అప్పుడు పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ అభ్యర్థి పోలీసుల కళ్లెదుటే తన అనుచరులను(నరసరావుపేటకు చెందిన వారిని) రెచ్చగొట్టి వెళ్లిపోయారు. 

అనంతరం వాళ్లు పోలీసులపై, పోలింగ్‌ బూత్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తమిళనాడుకు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌కు ఓ రాయి కడుపులో తగిలింది. దీంతో కిందపడిపోయిన పోలీసుపై కూడా విచక్షణ రహితంగా రాళ్లు రువ్వారు. అల్లరి మూకలు డీఎస్పీపై కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులు తమ గార్డులు అడ్డుపెట్టి డీఎస్పీని బూత్‌ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఇంత రభస చేసినా నరసరావుపేటకు చెందిన వారిని వదిలేసి స్థానికులపై కేసులు పెట్టి మమ అనిపించారు. అలాగే పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను టీడీపీ నాయకుడు వీసీరెడ్డి ధ్వంసం చేశాడు. పోలీసులు పట్టుకుని వచ్చి 41 నోటీసులు ఇచ్చి సరిపెట్టారేగానీ, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయంటూ వీసీ రెడ్డి డ్రామా ఆడి ఆస్పత్రి నుంచి పోలీసుల కన్ను కప్పి పారిపోయాడు. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగుల గొట్టారన్న ఆరోపణ వీడియో బయటకు వచ్చాక హడావుడిగా పోలీసులు వీసీరెడ్డిని పిలిపించి అరెస్ట్‌ చేసి కోర్టుకు పెట్టారు. ఇంత చేసిన వీసీరెడ్డి పై మాత్రం ఎలాంటి రౌడీïÙట్‌ పెట్టక పోవడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. 

అలాగే పోలింగ్‌ బూత్‌లో చొరబడి గందరగోళం సృష్టించిన, పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై మొక్కుబడిగా కేసులు పెట్టిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీకి చెందిన బూత్‌ ఏజెంట్లు, సామాన్యులపై రౌడీషీట్లు తెరవడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్‌కు 48 గంటల ముందే బయట ప్రాంతానికి చెందిన వారు నియోజకవర్గాల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. అయితే అంత మంది నరసరావుపేటకు చెందిన వారు పట్టణంలో ఎలా ఉన్నారో దర్శి పోలీసులే చెప్పాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement