అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు

Hyderabad: Thief Escaped From Jail Caught Police In Banjara Hills - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌( హైదరాబాద్‌): చోరీ కేసులో తప్పించుకున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ఓ కేసులో నిందితుడు మహ్మద్‌ గౌస్‌ను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇటీవల చంచల్‌గూడ జైలు నుంచి గౌస్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే పోలీసుల బారి నుంచి తప్పించుకొని పరారు కాగా అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. గౌస్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పీడీ యాక్ట్‌ కూడా నమోదై ఉండటం, బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 10లోని జహిరానగర్‌లో నివాసం ఉండటంతో అఫ్జల్‌గంజ్‌  పోలీసుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర, హోంగార్డు కృష్ణానాయక్‌తో కలిసి అరగంటలోనే నిందితుడిని పట్టుకొని అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు పక్కా ప్రణాళికతో గౌస్‌ నివాసం ఉండే ప్రాంతంలో నిఘా పెట్టారు. సరిగ్గా 5.30 గంటలకు గౌస్‌ తన భార్యను కలిసి ఇంట్లో నుంచి కొద్ది దూరం వెళ్ళి ఆటో కోసం వేచి చూస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు.

చదవండి: అయ్యో భగవంతుడా.. సాయం అందేలోపు.. ఆగిన శ్వాస

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top