నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు

Hyderabad Police Arrests Nigerian National In Mahesh Bank E Fraud Case - Sakshi

సైబర్‌ సెక్యూరిటీ విషయంలో మహేష్‌ బ్యాంకు యాజమాన్యం అలక్ష్యం.. దాంతో నెట్‌వర్క్‌ను ఈజీగా హ్యాక్‌ చేసిన నేరగాళ్లు

సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ మహేష్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చెస్ట్‌ ఖాతా నుంచి డబ్బు కొట్టేయడానికి సైబర్‌ నేరగాళ్లు ర్యాట్, కీలాగర్స్‌ వంటి మాల్‌వేర్స్‌ వాడారని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పారు. వీటి ద్వారానే హ్యాకర్లు బ్యాంక్‌ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి రూ.12.48 కోట్లు కొట్టేశారన్నారు. బుధవారం నైజీరియన్‌ ఇక్పా స్టీఫెన్‌ ఓర్జీని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 23కు చేరిందని చెప్పారు.

బ్యాంక్‌ను కొల్లగొట్టిన హ్యాకర్లు నైజీరియా లేదా లండన్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. గత నవంబర్‌ నుంచి సన్నాహాలు ప్రారంభించిన వీళ్లు మూడు మెయిల్‌ ఐడీల నుంచి బ్యాంక్‌ అధికారిక ఈ–మెయిల్‌ ఐడీకి ఆ నెల 4,10,16 తేదీల్లో 200 ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపారు. ఆర్టీజీఎస్‌ అప్‌గ్రేడ్‌ తదితరాలకు సంబంధించిన మెయిల్స్‌గా ఉద్యోగులు భ్రమించేలా వీటిని రూపొందించారు.

నవంబర్‌ 6న ఇద్దరు బ్యాంక్‌ ఉద్యోగులు వీటిని క్లిక్‌ చేశారు. ఫలితంగా దీనికి అటాచ్‌ చేసిన ఉన్న రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌ (ర్యాట్‌) ఆ రెండు కంప్యూటర్లలోకి చొరబడింది. దీని ద్వారా బ్యాంక్‌ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి వాటిలోకి కీలాగర్స్‌ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు కంప్యూటర్లను వాడిన ఉద్యోగులకు సంబంధించిన యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌తోపాటు అన్ని కార్యకలాపాలు హ్యాకర్‌కు చేరిపోయాయి.

అత్యంత బలహీనంగా సైబర్‌ సెక్యూరిటీ
రూ.వందలు, వేల కోట్ల ప్రజాధనంతో లావాదేవీలు జరిగే బ్యాంకులు తమ సైబర్‌ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఈ విషయంలో మహేష్‌ బ్యాంక్‌ కక్కుర్తి, నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన ఫైర్‌ వాల్స్‌ను ఏర్పాటు చేసుకోలేదు. దీనివల్లనే హ్యాకర్లు బ్యాంకు నెట్‌వర్క్‌ను తమ అ«ధీనంలో పెట్టుకుని ఎంపికచేసిన నాలుగు ఖాతాల నుంచి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు.

దీనికి సహకరించిన వారికి 5–10 శాతం కమీషన్లు ఇచ్చారు. విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న çప్రధాన హ్యాకర్లను కనిపెట్టడానికి ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు. నాణ్యతలేని సాఫ్ట్‌వేర్‌ అందించిన ఇంట్రాసాఫ్ట్‌ సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్‌ నిర్వాహకులను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top