రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్‌.. ‘వన్‌ ప్లస్‌’తో చిక్కాడు! | Sakshi
Sakshi News home page

రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్‌.. ‘వన్‌ ప్లస్‌’తో చిక్కాడు!

Published Fri, May 13 2022 8:13 AM

Hyderabad Police Arrest Hacker Swindled Rs 53 Lakh From Payment gateway - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేమెంట్‌ గేట్‌వేలను టార్గెట్‌గా చేసుకుని రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్‌ వి.శ్రీరాం దినేష్‌ కుమార్‌ను ఓ పేమెంట్‌ గేట్‌వేలో లభించిన చిన్న క్లూ ఆధారంగా పట్టుకున్నారు. ఎక్కడా తన ఉనికి బయటపడకుండా పక్కా పథకం ప్రకారం నేరాలు చేసిన ఇతగాడు చిక్కడానికి సెకండ్‌ హ్యాండ్‌ వన్‌ ప్లస్‌ ఫోన్‌ కారణమైంది. నగరానికి చెందిన పేజీ పేమెంట్‌ గేట్‌వే సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.52.9 లక్షలు కాజేసిన దినేష్‌ను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే.

ఏపీలోని పెడనకు చెందిన దినేష్‌ విజయవాడలో వెబ్‌ డిజైనింగ్‌ కార్యాలయం ఏర్పాటు చేశాడు.  లాక్‌డౌన్‌ కారణంగా నష్టాలు రావడంతో దీన్ని మూసేశాడు. అప్పటికే ఇతగాడికి పేమెంట్‌ గేట్‌వేలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ వల్నరబులిటీ టెస్ట్‌లపై పట్టు ఉండటంతో వాటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. పేజీ సంస్థ నుంచి నగదు కొల్లగొట్టడానికి పథకం వేసిన ఇతడికి స్నేహితుడు, చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయిన చింటు సహకరించాడు. వాట్సాప్‌లోని కొన్ని ‘నేరగాళ్ల గ్రూపుల్లో’ఔ దినేష్‌ సభ్యుడిగా ఉన్నాడు. వాటిలో ఉన్న వారి ద్వారానే జార్ఖండ్‌లోని జామ్‌తార చిరునామా, సోమ్‌నాథ్‌ పేరుతో ఉన్న గుర్తింపు పత్రాలు సంపాదించాడు. వీటిని వినియోగించే చెన్నైలోని ఈక్విటాస్‌ బ్యాంక్‌లో హైప్రోక్స్‌టెక్, ఇన్వెంట్‌ఫైల్‌ సంస్థల పేర్లతో వర్చువల్‌ ఖాతాలు తెరిచాడు.

బెంగళూరులో ఎస్‌ బ్యాంక్‌ శాఖను వర్చుల్‌గా సంప్రదించి తను తయారు చేసిన మూడు యాప్‌ల ఆధారంగా ఏఎన్సార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో వారి పూల్‌ ఖాతాకు యాక్సస్‌ పొందాడు. వీటికి లింక్‌ చేసిన ఫోన్‌ నంబర్ల సిమ్‌కార్డులను చింటు తప్పుడు పేర్లతో ఉత్తరాదిలోని ప్రాంతాల నుంచి తెప్పించాడు. పేజీ సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన దినేష్‌ దాని పూల్‌ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు రెండు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. వాటి నుంచి యస్‌ బ్యాంక్‌లోని పూల్‌ ఖాతాలోకి బదిలీ చేశాడు. ఈ ఖాతా నుంచి బోగస్‌ వివరాలతో తెరిచిన బిట్‌కాయిన్‌ వాలెట్‌లోకి, దాని నుంచి మరో బిట్‌కాయిన్‌ సైట్‌లోని తన సొంత వాలెట్‌లోకి మళ్లించాడు. అక్కడి నుంచి నగదుగా మార్చి తనతో పాటు సన్నిహితులకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని ట్రాన్స్‌ఫర్‌ చేసి డ్రా చేసుకున్నాడు.

ఈ కేసు దర్యాప్తులో ఎథికల్‌ హ్యాకర్ల సహకారం తీసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నేరం జరిగిన తీరు గుర్తించారు. అయితే జామ్‌తార సైతం సైబర్‌ నేరగాళ్ల అడ్డా కావడంతో సోమ్‌నాథే నిందితుడిగా భావించారు. కొన్ని రోజులు అతడి కోసం గాలించినా ఫలితం లేదు. బోగస్‌ వివరాలతో సిమ్‌కార్డులు కొనే దినేష్‌ వాటిని వాడటానికి కొత్త ఫోన్లు ఖరీదు చేయడు. పోలీసులకు చిక్కకూడదనే సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు కొనేవాడు. ఇదే తరహాలో విజయవాడకు చెందిన వ్యక్తి నుంచి వన్‌ ప్లస్‌ కంపెనీ ఫోన్‌ను రూ.16 వేలకు కొనుగోలు చేశాడు. అతడికి రూ.15 వేలు నగదు ఇచ్చి తాను వాడే ఓ బోగస్‌ నంబరే ఇచ్చాడు. తనకు రావాల్సిన రూ.వెయ్యి కోసం ఇతడు ఒత్తిడి చేయడంతో దినేష్‌ రూ.1000 పేటీఎం ద్వారా పంపాడు.

తన వద్ద ఉన్న సిమ్‌కార్డును ఫోన్‌లో వేసి నేరంలో వాడాడు. ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ ద్వారా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విజయవాడ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి వద్ద కూడా దినేష్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే తనకు రూ.1000 బదిలీ అయిన పేటీఎం నంబర్‌ ఇచ్చాడు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు దినేష్‌ను పట్టుకోగలిగారు. పేజీ సంస్థలో దినేష్‌ చేసింది రెండో హ్యాకింగ్‌గా పోలీసులు చెబుతున్నారు. మొదటిసారిగా గతేడాది నవంబర్‌లో దీన్ని సర్వర్‌ను హ్యాక్‌ చేసి కొందరు హ్యాకర్లు రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు. అప్పట్లో ఈ నగదు వెళ్లిన ఆరు ఖాతాలు ఒడిస్సా, వెస్ట్‌ బెంగాల్‌లకు చెందినవిగా తేలింది. అవన్నీ బోగస్‌ వివరాలతో తెరిచినవి కావడంతో ఆధారాలు దొరక్క కేసు ముందుకు వెళ్లలేదు.   

Advertisement
 
Advertisement
 
Advertisement