నవల్స్‌ పేరుతో నయ వంచన.. వాళ్లే టార్గెట్‌

Hyderabad: Girl Cheated Money In The Name Of Novels Copy Work - Sakshi

సాక్షి,హిమాయత్‌నగర్‌: ప్రముఖ నవలలను సాఫ్ట్‌ కాపీల్లో తయారు చేయాలంటూ పేపర్, టీవీ, సోషల్‌ మీడియా ద్వారా యాడ్స్‌ ఇచ్చి నయా వంచనకు తెరతీశారు యూఎస్‌కు చెందిన ‘డిజినల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ’ నిర్వాహకులు. ఒక్కో పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని గృహిణులను టార్గెట్‌ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు. చేసిన పనికి సరైన రీతిలో లాభాలు, వేతనాలు ఇవ్వకపోవడంతో మనదేశంలో ఈ కంపెనీని నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన అమిత్‌శర్మపై బాధితులు బుధవారం సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భుపాల్‌కు ఫిర్యాదు చేశారు.

బాధితులు స్రవంతి, కిషోర్, శ్రీనివాసరావు, సునీల్‌సింగ్, వికాస్, మనోజ్, వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కొన్ని నెలల క్రితం యూఎస్‌కు చెందిన ‘డిజినల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌’ కంపెనీ నిర్వాహకులు వర్క్‌ఫ్రం హోం పేరుతో ప్రకటనలు  ఇచ్చారు. పలు ప్రముఖ నవల్స్‌ను ఇచ్చి వాటిలో ఉన్న ఒక్కో పేజీని పీడీఎఫ్‌గా మార్చి కంపెనీకి సబ్‌మిట్‌ చేయాలి. ఒక్కో పేజీకి రూ.5 కమీషన్‌ ఇచ్చేందుకు బాధితులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను  రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే తమ కంపెనీ నుంచి ఒక స్కానర్‌ ఇస్తామన్నారు.దీంతో పలువురు మహిళలు డిపాజిట్‌ చేశారు. దీంతో వారికి వారు చేసిచ్చిన పనికి సంబంధించి వేతనం, లాభాలు సైతం ఓ మూడు నెలల పాటు ఇవ్వడం జరిగింది.

జూన్‌ నెలలో టూ పాయింట్‌ ఓ(2.0) పేరుతో అమిత్‌శర్మ మరో స్కీంను ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.5.50 లక్షలు డిపాజిట్‌ చెల్లించాలని చెప్పడంతో ప్రస్తుతం వీరికింద చేస్తున్న వారు ఆసక్తి కనబరిచారు. వీరు కట్టడమే కాకుండా తమ బంధువులు, స్నేహితులను కూడా ఈ స్కీంలో చేర్పించారు. నెల గడిచినా చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోవడంతో బాధితులు అమీర్‌పేట, బంజారాహిల్స్‌లోని కార్యాలయాల వద్దకు వెళ్లి నిలదీశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది తమకేమీ తెలిదనడంతో అమిత్‌శర్మకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆగ్రహించిన బాధితులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భుపాల్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జాయింట్‌ సీపీ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top