యువతికి చుక్కలు చూపించిన ‘మైనర్‌’..

HYD: Cyber Crime Police Arrested Minor Boy For Hacking - Sakshi

బయటపడిన మైనర్‌ నిజ స్వరూపం

యువతికి సహకరిస్తున్నట్లుగా బాలుడి నటన

గుట్టుగా సైబర్‌ వేధింపులు పట్టుకున్న సైబరాబాద్‌ సైబర్‌ కాప్స్‌ 

అబ్జర్వేషన్‌ హోమ్‌కు తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: పైకి చూస్తే మైనరే. చేసే పనులు మాత్రం ముదురే. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉంటే నమ్మక ద్రోహానికి ఒడిగట్టాడు. ఓ యువతికి చుక్కలు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు ‘మైనర్‌’ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఓ సందర్భంలో ఆమెకు సహకరించిన ఇతగాడు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిటీకి చెందిన ఓ యువతి వైద్య విద్యనభ్యసిస్తున్నారు. ఆమెకు చెందిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో పాటు తొలగించడం కోసం ఆమె తన పక్కింట్లో ఉండే ఓ బాలుడి సహాయం తీసుకున్నారు. అతడు ఈ యువతితో స్నేహంగా, ఆత్మీయంగా మెలిగేవాడు.  

ఆమెకు సహకరించిన ఇతగాడు తన ఈ– మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తదితరాలను సంగ్రహించాడు. అదను చూసుకుని ఆమె మెయిల్‌ ఐడీని యాక్సెస్‌ చేశాడు.  దాని ద్వారా ఆమె ఆన్‌లైన్‌ క్లాసుల్లోకి అక్రమంగా ప్రవేశించేవాడు. అంతటితో ఆగకుండా ఆ క్లాసుల్లో ఆమె పోస్టు చేస్తున్నట్లు అసభ్య, అశ్లీల ఫొటోలు షేర్‌ చేసేవాడు. ఆ మెయిల్‌లో ఆమె సేవ్‌ చేసుకున్న ఫొటోలను తన అధీనంలోకి తీసుకున్నాడు. తన వద్ద ఉన్న మెయిల్‌ వివరాల ఆధారంగా వారి ఇంటి వైఫై కనెక్షన్‌ను యాక్సెస్‌ చేసి ఫోన్లు హ్యాంగ్‌ అయ్యేలా చేశాడు. ఇలా వాటిని గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్‌ చేసిన భావన కలిగించాడు. బాధితురాలి ఫేస్‌బుక్‌ ఖాతాను యాక్సెస్‌ చేసిన బాలుడు అందులో ఆమె చేసినట్లు అశ్లీల ఫొటోలు పోస్టు చేశాడు. ఆమెతో పాటు వారి కుటుంబికుల దైనందిన జీవితాలను చూస్తున్న ఈ మైనర్‌ ఆ వివరాలను వారికి మెయిల్‌ చేసి తమ ఫోన్లు హ్యాక్‌ అయినట్లు భావించేలా చేశాడు.

ఈ పనులు చేస్తూ తనలో తాను వికృతానందం పొందేవాడు. కొన్ని సందర్భాల్లో నిజం తెలియని బాధితురాలు ఈ బాలుడి వద్దకే వచ్చి విషయం చెప్పేది. తన ఫేస్‌బుక్‌ ఖాతా బ్లాక్‌ చేయాలని కోరేది. ఆమె ముందు అలాగే చేసిన మైనర్‌ ఆ తర్వాత యాక్టివ్‌ చేసే వాడు. తుదకు సైబర్‌ వేధింపులతో విసిగివేసారిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్వాపరాలు పరిశీలించి, సాంకేతికంగా దర్యాప్తు చేసి యువతి పక్కింటి బాలుడే బాధ్యుడని తేల్చారు. అతడిని పట్టుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు అబ్జర్వేషన్‌ హోమ్‌కు తరలించారు.

చదవండి: ఖైరతాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్‌ చేస్తూ.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top