నువ్వు రాకపోతే ఆడపిల్లలను చంపేస్తా | Sakshi
Sakshi News home page

నువ్వు రాకపోతే ఆడపిల్లలను చంపేస్తా

Published Fri, Sep 16 2022 4:53 AM

Husband Harassment to wife and Assassination Attempt on own Kids - Sakshi

పెంటపాడు: కన్నతండ్రే తన ఇద్దరు ఆడపిల్లలను చంపేందుకు సిద్ధమై విచక్షణారహితంగా దాడి చేశాడు. పిల్లలు భయంతో ఏడుస్తూ తమను చంపవద్దని తండ్రిని వేడుకుంటుండగా, వీడియో తీయించి కుటుంబ పోషణ కోసం కువైట్‌ వెళ్లిన తన భార్యకు పంపించాడు. భార్యను వెంటనే తెరిగి రావాలని, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులోని ఎస్సీపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెంటపాడు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పెంటపాడు మండలం వీరపాలేనికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, కుమారుడు ఆకాష్‌(13), కుమార్తెలు అలేఖ్య(12), అమృత(11) ఉన్నారు. మద్యానికి బానిసైన దావీదు తన భార్యపై అనుమానంతో తరచూ కొడుతుండేవాడు. అతను ఏ పని చేయకుండా తాగి గొడవ చేస్తుండటంతో కుటుంబ పోషణ కోసం నిర్మల ఏడాది కిందట కువైట్‌ వెళ్లింది.

నాలుగు నెలల కిందట దావీదు తన పిల్లలను తీసుకుని పెంటపాడు వచ్చి ఎస్సీ పేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తన భార్యను ఎలాగైనా కువైట్‌ నుంచి రప్పించాలని దావీదు కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరు ఆడపిల్లలను చిత్రహింసలు పెడుతూ కుమారుడితో వీడియోలు తీయించి భార్యకు పంపుతున్నాడు. ఇది చూసి తట్టుకోలేని నిర్మల ఆ వీడియోలను గురువారం గ్రామ సర్పంచ్‌ తాడేపల్లి సూర్యకళకు పంపింది.

సర్పంచ్‌ వెంటనే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు విశాల్‌కు వాటిని పంపారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో ఆయన సూచన మేరకు విశాల్‌ స్థానిక పోలీసులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. వారు వెళ్లేసరికి పిల్లలను కొమ్ముగూడెంలోని బంధువుల ఇంటి వద్ద వదిలి దావీదు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement