గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్‌ అరెస్ట్‌  | Haryana YouTuber Jyoti Malhotra Arrested | Sakshi
Sakshi News home page

గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్‌ అరెస్ట్‌ 

May 18 2025 5:56 AM | Updated on May 18 2025 5:56 AM

Haryana YouTuber Jyoti Malhotra Arrested

ఐఎస్‌ఐ అధికారులతో జ్యోతికి సంబంధాలు 

వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌లో దేశ సున్నిత సమాచారం చేరవేత 

పలుమార్లు పాకిస్తాన్‌లో పర్యటన 

పాక్‌ హైకమిషన్‌ మాజీ ఉద్యోగితో సంబంధాలు

చండీగఢ్‌: హరియాణాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌చేశారు. పాకిస్తాన్‌ సైనిక నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదుచేశారు. శుక్రవారం ఆమెను హరియాణాలోని హిస్సార్‌లోని న్యూ అగ్రసేన్‌ ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో అరెస్ట్‌చేశారు. 

స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని ఐదు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ జడ్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హై కమిషన్‌లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్‌ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచి్చనట్లు తెలుస్తోంది. పాకిస్తానీ అధికారితో కలిసి గూఢచర్యం కేసులో పంజాబ్‌ పోలీసులు ఇప్పటికే ఒక మహిళ సహా ఇద్దరిని అరెస్ట్‌ చేయడం తెల్సిందే. 

ఎవరీ జ్యోతి? 
హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్‌ విత్‌ జో’పేరిట ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. ట్రావెల్‌ బ్లాగర్‌గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్‌చేశారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌కు వెళ్లింది. 

అక్కడ ఎహ్సాన్‌ ఉర్‌ రహీమ్‌ అలియాస్‌ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్‌ ఆదేశానుసారం అలీ అహా్వన్‌ అనే వ్యక్తి ఈమెకు పాక్‌లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్‌లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్‌ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్‌బాజ్‌లతో పరిచయం పెంచుకుంది. షహ్‌బాజ్‌ ఫోన్‌నంబర్‌ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో జాట్‌ రంధావా అనే వేరే పేరుతో సేవ్‌చేసింది.

 వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాప్‌ యాప్‌లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్‌ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్‌కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్‌ అనుకూల వీడియోలు తీసి పోస్ట్‌చేసింది. పాక్‌లో కతాస్‌ రాజ్‌ టెంపుల్‌సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్‌ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement