విదేశీ వనిత కేసులో ఇద్దరికి అర్ధ జీవిత ఖైదు 

Half life imprisonment for two in foreign woman case - Sakshi

నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు  

10 రోజుల్లో చార్జ్‌ షీటు.. 57 రోజుల్లోనే విచారణ పూర్తి 

నెల్లూరు (లీగల్‌): విదేశీ పర్యటనకు వచ్చిన వనితపై లైంగిక దాడికి యత్నించిన మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్, గూడూరు శారదనగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌అబీద్‌లకు జీవిత కాలంలో సగభాగం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సి.సుమ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. లిథువేనియా దేశానికి చెందిన ఓ విదేశీ వనిత శ్రీలంకకు వచ్చారు. అక్కడి నుంచి ఈ ఏడాది మార్చి 7న చెన్నైకి చేరుకున్నారు.

అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో కండక్టర్‌ దిగి పొమ్మన్నారు. బస్సులో ఉన్న సాయికుమార్‌ గమనించి ఆమెకు నగదు సాయం చేసి బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను బద్దవోలు వెంకన్నపాలెంలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తన స్నేహితుడు అబీద్‌తో కలిసి విదేశీ వనితను సైదాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి యత్నించారు. ఆమె తప్పించుకుని రోడ్డుపై వెళ్తున్న స్థానికుల సాయంతో సైదాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక దృష్టి సారించి కేసును దిశ పోలీసులకు అప్పగించారు. విదేశీ వనిత కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్‌ చేసింది. దర్యాప్తు అనంతరం 10 రోజుల్లో కోర్టులో చార్జ్‌ షీటు దాఖలు చేసింది. కేసుపై ప్రత్యేక దృష్టి సారించి 57 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాధుప్రసాద్‌ కేసు వాదించారు. జిల్లాలో అతి తక్కువ రోజుల్లో కేసు విచారణ చేసి తీర్పు వెలువరించడం గమనార్హం.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top