నకిలీ పత్రాలతో మాయ.. రూ. 7 కోట్లు కాజేసిన ముఠా

Gang Cheated Builder With Fake Documents And Sell Government Land Worth Rs 7 Crore - Sakshi

నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలం విక్రయం 

నిందితుల్ని అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: వివాదంలో ఉన్న ప్రభుత్వ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, నగరానికి చెందిన ఓ బిల్డర్‌కు రూ.7 కోట్లకు విక్రయించిన కేసులో నిందితుల్ని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్కారుది కాగా... తమదే అంటూ కొందరు ప్రైవేట్‌ వ్యక్తులూ క్లెయిమ్‌ చేస్తున్నారు. ఓపక్క ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా జరిగిన మోసం బయటపడింది. బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా  9 ఎకరాల 17 గుంటల స్థలం ఉంది. ఇది తమదేనంటూ తిరుమల రాంచందర్‌ రావు, దర్పల్లి సంపత్, తిరుమల హరిలు నకిలీ పత్రాలు సృష్టించారు.

ఈ ముగ్గురూ కలిసి ఆ స్థలంతో 2 ఎకరాలు విక్రయిస్తామని, మిగిలిన స్థలంలో అపార్ట్‌మెంట్లు నిర్మించడానికి ఇస్తామంటూ జుబ్లీహిల్స్‌కు చెందిన మిహిరా బిల్డ్‌కాన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ సి.సుఖేష్‌ రెడ్డిని కలిశారు. ఆ స్థలానికి సంబంధించి తయారు చేసిన నకిలీ పత్రాలు ఆయనకు అందించారు. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన సుఖేష్‌ కొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో రూ.7 కోట్లు చెల్లించి పత్రాలు రాసుకున్న సుఖేష్‌ 2 ఎకరాలు ఖరీదు చేసేలా, మిగిలింది అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆర్ధిక లావాదేవీలు కమలేశ్వర్‌రావు, ఈగ మల్లేశం, సుభాష్‌ చౌదరీల సమక్షంలో జరిగాయి. సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైన సుఖేష్‌ అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ నేపథ్యంలో స్థలం పత్రాలపై అనుమానాలు వ్యక్తమై ఆరా తీయగా అవి నకిలీవిగా తేలింది. దీంతో ఆయన జరిగిన మోసంపై సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి నిందితులు రాంచందర్, సంపత్, హరిలను అరెస్టు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు.  

చదవండి: మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top