మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు.. | Sakshi
Sakshi News home page

మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..

Published Sat, Feb 13 2021 12:38 PM

2 Men Held Of 7 Members Gang Who Makes Fake Documents Sold Plots In Meerpet - Sakshi

సాక్షి, మీర్‌పేట: ఖాళీ ప్లాట్లపై కన్నేసి యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాదర్‌గుల్‌కు చెందిన వల్లాల ప్రేమ్‌కుమార్‌ (45), బాలాపూర్‌కు చెందిన చెరుకూరి కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, కృష్ణారెడ్డి, హేమలత, నరేష్‌, వి.శివారెడ్డి, ఏ.సంతోష్, ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలు కలిసి 1980–90 నాటి వెంచర్లలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి వాటికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి అసలు యజమానులకు తెలియకుండా ఇతరులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. 

కాగా సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌కు చెందిన అక్కాచెళ్లెల్లు తుమ్మల రమాదేవి, తుమ్మల యహేమలతలకు చెందిన మీర్‌పేట నందిహిల్స్‌ సర్వే నం.29లో రెండు ప్లాట్ల (నం–21, 22)కు సైతం 1985 నాటి నిజమైన పత్రాలను పోలి ఉండేలా నకిలీ పత్రాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ప్లాట్ల యజమానులు రమాదేవి, హేమలత వెంటనే మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకూరి కిరణ్‌కుమార్‌తో కలిసి మొత్తం 8 మంది సభ్యులు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఏ3గా ఉన్న వల్లాల ప్రేమ్‌కుమార్, ఏ6గా ఉన్న ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలను శుక్రవారం అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో హస్తినాపురం మాజీ కార్పొరేటర్‌ సోదరుడు కూడా ఉన్నాడని సీఐ పేర్కొన్నారు.

Advertisement
Advertisement