అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident In Tyre Godown In Afzalgunj Hyderabad - Sakshi

పాత టైర్ల గోదాములో ప్రమాదవశాత్తు ఘటన 

పెద్ద సంఖ్యలో కాలిపోయిన టైర్లు 

రూ.4.5 లక్షల ఆస్తినష్టం

సాక్షి, హైదరాబాద్‌: అఫ్జల్‌గంజ్‌లోని కేంద్ర గ్రంథాలయం ఎదురుగా ఉన్న పెట్రోల్‌ పంప్‌ వెనుక ఓ పాత టైర్ల గోదాములో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి అక్కడ భారీగా నిల్వ చేసిన పాత టైర్లకు అంటుకోవడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో టైర్లు కాలి బూడిదయ్యాయి. అఫ్జల్‌గంజ్‌ పరిసర ప్రాంతాల్లో చాలాసేపు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనదారులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఉస్మాన్‌షాహీ ప్రాంతానికి చెందిన కొంతమంది పాత టైర్ల వ్యాపారులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖకు, అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న పెట్రోల్‌ పంప్‌ను మూసివేయించారు. దాదాపు 15 ఫైరింజన్లతో సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ.4.5 లక్షల విలువ చేసే పాత టైర్లు దగ్ధమయ్యాయని తెలుస్తోంది.
 

పోలీసుల పనితీరుపై స్థానికుల ప్రశంసలు 
అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమార్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంటలను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సత్వరమే చర్యలు చేపట్టారు. దీంతో పోలీసుల పనితీరును స్థానికులు ప్రశంసించారు. పక్కనే గుడి సెల్లో నివాసముండే కొంతమంది పాతటైర్లను కాల్చి అందులో ఉండే తీగలను తీసే క్రమంలో ప్రమాదం జరిగిందా, చిత్తు కాగితాలు ఏరుకునే వారు తాగిన మైకంలో పాత వైర్లను కాల్చే క్రమంలో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల అఫ్జల్‌గంజ్, మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్, ఛాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.  


చదవండి: నోట్లకట్టలు గ్యాస్‌స్టవ్‌పై పెట్టి నిప్పుపెట్టిన మధ్యవర్తి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top