దొరికిపోతానని రూ.5 లక్షలు కాల్చేశాడు!

Man Burns Bribe Amount To Escape From Being Caught By ACB In Telangana - Sakshi

క్రషర్‌ ఏర్పాటు కోసం రూ.6 లక్షలు అడిగిన వెల్దండ తహశీల్దార్‌ సైదులు 

మధ్యవర్తికి డబ్బులు ఇవ్వాలని సూచన 

లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి

నోట్లకట్టలు గ్యాస్‌స్టవ్‌పై పెట్టి నిప్పుపెట్టిన మధ్యవర్తి 

నిందితులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 

కల్వకుర్తి టౌన్‌/కల్వకుర్తి/వెల్దండ/మన్సూరాబాద్‌: అవినీతి వ్యవహారంలో లంచంగా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రావడంతో ఆ నోట్ల కట్టలను గ్యాస్‌స్టవ్‌పై పెట్టి తగలబెట్టేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం కల్వకుర్తిలోని విద్యానగర్‌లో జరిగింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌ తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరంతకుంట తండా సర్పంచ్‌ రమావత్‌ రాములునాయక్‌ వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామ శివారులో ఉన్న 15 హెక్టార్ల భూమిలో క్రషర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి జనవరి 12న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

అనంతరం ఫిబ్రవరి 16న భూమి సర్వేకు హాజరు కావాలని రాములునాయక్‌కు వెల్దండ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. సర్వే కోసం రూ.6 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్‌ సైదులు డిమాండ్‌ చేశారు. దాదాపు నెల పాటు చర్చలు జరిగిన తర్వాత రూ.5లక్షలు ఇచ్చేందుకు రాములునాయక్‌ ఒప్పుకున్నారు. ఈ డబ్బులను మధ్యవర్తి, వెల్దండ మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్‌ సూచించారు. దీంతో రాములు నాయక్‌ ఈనెల ఒకటో తేదీన మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం సాయంత్రం డబ్బులు ఇచ్చేందుకు కల్వకుర్తిలోని విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటయ్యగౌడ్‌ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. 

ఇంటికి ఎవరో వచ్చారని పోలీసులకు ఫోన్‌.. 
ఏసీబీ అధికారులు వచ్చినా వెంకటయ్యగౌడ్‌ తలుపు తీయకుండా.. తన ఇంటికి ఎవరో వచ్చారని స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. వారు ఏసీబీ అధికారులు అని తెలుసుకుని వెనుదిరిగారు. అదే సమయంలో తాను దొరికిపోతాననే భయంతో వెంకటయ్యగౌడ్‌ వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌స్టవ్‌పై డబ్బులు పెట్టి నిప్పంటించారు. వెంటనే మరో తలుపు నుంచి వయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి అతడిని పట్టుకున్నారు. కాలుతున్న నోట్లపై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. అయితే, అప్పటికే నోట్లన్నీ దాదాపు 70శాతం మేరకు కాలిపోయాయి.


తగలబడిన నోట్లు   
అనంతరం వెంకటయ్యగౌడ్‌ను విచారించి, అతడిని తీసుకుని వెల్దండ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఏసీబీ అధికారులు వెంకటయ్యగౌడ్‌ను కార్యాలయంలోకి తీసుకెళుతుండగా.. పలువురు బాధితులు ఆయనపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ సైదులును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులను బుధవారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌ తెలిపారు. నిందితుల ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా, తహసీల్దార్‌ వేధింపులకు విసిగిపోయిన కొందరు బాధితులు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top