నేనేం చేశాను నాన్నా..!

Father And Two Year Old Son Passed Away In Nirmal District - Sakshi

రెండేళ్ల కొడుక్కి ఉరేసి.. తండ్రి బలవన్మరణం

భార్య తరఫు వేధింపులే కారణమంటూ సూసైడ్‌నోట్‌

నిర్మల్‌/నర్సాపూర్‌(జి): నిండా రెండేళ్లు లేని కొడుకుతో కలిసి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు.. లోకేశ్వరం మండలం కనకాపూర్‌ గ్రామానికి చెందిన బరిడే వినేశ్‌(24)కు కుభీర్‌ మండలంలోనిసాంవ్లీ గ్రామానికి చెందిన సరితతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం అభిరామ్‌ అలియాస్‌ అయాన్‌ జన్మించాడు. ఇద్దరు అన్నదమ్ములతో కలిసి వినేశ్‌ సొంతూరులోనే గొర్రెలమందను చూసుకుంటున్నాడు.

ఇటీవలే ఆస్తిపంపకాలూ చేసుకుని అన్నదమ్ములు ప్రశాంతంగా ఉన్నారు. ఈక్రమంలో ఈనెల 20న సరిత, అభిరామ్‌లను తీసుకుని వినేశ్‌ బైక్‌పై తన అత్తగారి ఊరు సాంవ్లీకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దుకాణానికి వెళ్దామని చెప్పి కొడుకు అభిరామ్‌ను పిలిచాడు. బండిపై వెళ్లిన ఆ తండ్రీకొడుకులు సాయంత్రమైనా తిరిగి రాలేదు. కనకాపూర్‌ వెళ్లాడేమోనని సరిత కుటుంబసభ్యులు ఫోన్‌ చేసి ఆరా తీశారు. అక్కడికీ రాలేదని తేలడంతో కుభీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 21నుంచి గాలిస్తున్నా.. వినేశ్‌ తన వెంట సెల్‌ఫోన్‌ తీసుకెళ్లక పోవడంతో ఆచూకీ లభించలేదు.

కొడుక్కి ఉరేసి.. తానూ వేసుకుని..
జిల్లాలోని నర్సాపూర్‌(జి) మండలం నసీరాబాద్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మహిళలు మంగళవారం తునికాకు సేకరణకు వెళ్లారు. అక్కడ చెట్టుకు వేలాడుతూ రెండు కుళ్లిన శవాలు కనిపించాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి, నిర్మల్‌రూరల్‌ సీఐ వెంకటేశ్, ఎస్సైలు అక్కడకు వెళ్లి పరిశీలించారు. సమీపంలో లభించిన బైక్, చిన్నారి అభిరాం మృతదేహం ఆధారంగా ఈనెల 21న సాంవ్లీ నుంచి బయలుదేరిన తండ్రీకొడుకులేనని ధ్రువీకరించారు. ముందుగా కొడుక్కి ఉరేసి, తర్వాత వినేశ్‌ ఉరేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

కలహాలే కారణం..
ఘటనాస్థలంలో వినేశ్‌ రాసినట్లుగా ఉన్న సూసైడ్‌ నోట్‌ దొరికింది. తమ ఆత్మహత్యలకు భార్య, బామ్మర్దిల వేధింపులే కారణమని రాసినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య స్పర్థలు ఉన్నాయని, గతంలోనూ ఇలాగే కొడుకును తీసుకుని వినేశ్‌ బయటకు వెళ్లాడని, మళ్లీ పోలీసుల సాయంతో తిరిగి వచ్చాడని బంధు వులు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top