రూ.3 లక్షలకు.. రూ.12 లక్షల నకిలీ నోట్లు | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలకు.. రూ.12 లక్షల నకిలీ నోట్లు

Published Sat, Jan 1 2022 6:10 AM

Fake Currency Notes Created Sensation In Visakhapatnam - Sakshi

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణీ కలకలం రేపింది. సీతమ్మధారకు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి నకిలీ నోట్లు తీసుకొస్తున్నట్టు ఎంవీపీ కాలనీ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో ద్వారకా ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు. ఎంవీపీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు గురువారం రాత్రి రాజాన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్దనున్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా సీతమ్మధారకు చెందిన యాగంటి ఈశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఈ నకిలీ నోట్లు పొందినట్లు వెల్లడించాడు.

ఈశ్వరరావుకు రూ.3 లక్షల నగదు ఇవ్వగా, అతను ఒడిశా తీసుకెళ్లి రూ.12 లక్షల విలువచేసే నకిలీ నోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. ఇందులో రూ.4.77 లక్షల నకిలీ నోట్లు ఇప్పటికే మార్చినట్లు చెప్పాడు. విష్ణు ఇచ్చిన సమాచారంతో ఈశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. ఈ నోట్లలో రూ.100, రూ.200, రూ.500 నోట్లు ఉన్నాయని, నిందితులు ఇద్దర్నీ శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించిందన్నారు. ఒడిశా కేంద్రంగా నడుస్తున్న నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణయ్య, ఎస్‌ఐ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement