‘కార్వీ’ చుట్టూ ఈడీ ఉచ్చు

ED Interrogated Karvy Stock Broking MD Parthasarathy - Sakshi

స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ సీఎండీ పార్థసారథిని జైలులోనే విచారిస్తున్న అధికారులు 

మదుపరుల షేర్లను తనఖా పెట్టి రూ. వెయ్యి కోట్ల రుణం తీసుకున్న నిందితులు 

హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో ఐదు కేసులు

ఆస్తుల తాత్కాలిక జప్తు కోణంలో ఈడీ యోచన 

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(కేఎస్‌బీఎల్‌) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ఆ సంస్థ చైర్మన్‌ సి.పార్థసారథితోపాటు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ రంజన్‌సింగ్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జి.కృష్ణహరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజలను ప్రశ్నించింది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ రెండు కమిషనరేట్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మేర మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది.

నాంపల్లి కోర్టు నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉండటంతో చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తున్నారు. వారంపాటు పార్థసారథిని ప్రశ్నించడానికి అనుమతి కోరగా  మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆది, సోమవారాల్లో ఆయనను ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా విచారించనున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) అధికారుల నుంచి సేకరించిన ఎఫ్‌ఐఆర్‌లను బట్టి ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీల్యాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

పవర్‌ ఆఫ్‌ అటార్నీని అనువుగా మార్చుకొని... 
కార్వీ ద్వారా డీమ్యాట్‌ ఖాతాలు తెరిచేందుకు మదుపరులు ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటార్నీని పార్థసారథి తనకు అనువుగా మార్చుకుని భారీ స్కామ్‌కు తెగబడ్డారు. మదుపరుల అను మతి లేకుండా వారి డీమ్యాట్‌ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. అవన్నీ తమవే అంటూ చూపించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలను సంప్రదించి కొలట్రల్‌ సెక్యూరిటీ(తనఖా)గా పెట్టి దాదాపు రూ.వెయ్యి కోట్లు అప్పు గా తీసుకున్నారు.

ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి, వాటి అభివృద్ధి–విస్తరణలకు వినియోగించాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ సంస్థల్లోకి మళ్లించి భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన వివరాల కోసమే పార్థసారథిని ప్రశ్నించి సమగ్ర వాంగ్మూలం నమోదు చేస్తోంది. కోర్టు అనుమతితో మిగిలిన నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలికంగా జప్తు చేయనుంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top