2,000 కిలోల గంజాయి స్వాధీనం

East Godavari police arrested three people and Seized 2000 kg of Cannabis - Sakshi

ఒడిశా నుంచి తెలంగాణకు తరలించేందుకు యత్నం

ముగ్గుర్ని అరెస్టు చేసిన తూర్పుగోదావరి పోలీసులు

దీని విలువ రూ.2 కోట్లకు పైనే!

చింతూరు: రాష్ట్రంలో గంజాయి రవాణాపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏఎస్పీ కృష్ణకాంత్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుకుమామిడి అటవీ ప్రాంతం మీదుగా గంజాయి రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో సీఐ యువకుమార్, ఎస్‌ఐ సత్తిబాబు వాహన తనిఖీలు చేపట్టారు.

ఇదే సమయంలో కొబ్బరికాయల లోడ్‌తో వచ్చిన ఓ వ్యానును తనిఖీ చేయగా.. కొబ్బరికాయల కింద గంజాయి మూటలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణకు చెందిన కడియం గురుసాగర్, పొగిడాల పర్వతాలు, ఒడిశాకు చెందిన నైని రామారావును అరెస్టు చేసి.. 2 వేల కిలోల గంజాయి, వ్యాన్‌ను, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏజన్సీ వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు.

ఏజెన్సీలో ముమ్మరంగా గంజాయి తోటల ధ్వంసం
సీలేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతోంది. బుధవారం గుమ్మరేవుల పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో గంజాయి మొక్కలను స్థానికులు నరికేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్‌ఐ రంజిత్‌ చేపట్టిన చర్యలతో చింతగుప్ప, పొలుతురుకోట గ్రామాల ప్రజలు గంజాయి మొక్కలను నరికేసి.. ఇకపై గంజాయి సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. 
చింతగుప్ప గ్రామంలో గంజాయి మొక్కలు నరికివేస్తున్న గిరిజనులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top