కొట్టేసిన బంగారాన్ని  తన ఇంట్లోనే దాచాడు

DCP Gone Sandeep Says Snatcher Umesh Khatik Confessed His Thefts - Sakshi

కుత్బుల్లాపూర్‌(హైదరాబాద్‌): సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతిక్‌ ఎట్టకేలకు నోరు విప్పాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే ఉందని వెల్లడించాడు. ఉద్దేశపూర్వకంగానే అహ్మదాబాద్‌ పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు అంగీకరించాడు. ఇతడిని వారం కస్టడీలోకి తీసుకుని విచారించిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు 19 తులాల బంగారం రికవరీ చేసినట్లు బాలానగర్‌ డీసీపీ గోనె సందీప్‌ బుధవారం వెల్లడించారు.  

అహ్మదాబాద్‌లోని నారన్‌పురకు చెందిన ఉమేష్‌ విలాసవంతమైన జీవితం గడపడానికి చైన్‌ స్నాచింగ్స్‌ చేసేవాడు. గతేడాది ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చి అహ్మదాబాద్‌లో స్నాచింగ్స్‌ చేశాడు. డిసెంబర్‌లో బెంగళూరులో పంజా విసిరాడు. నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ఈ ఏడాది జనవరిలో వచ్చాడు. 
► అదే నెల 18న నగరంలోని నాంపల్లిలోని మెజిస్టిక్‌ లాడ్జిలో దిగిన ఉమేష్‌ అదే రోజు  ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు. మరుసటి రోజు దానిపైనే సంచరిస్తూ అల్వాల్‌లో మొదలు పెట్టి మేడిపల్లి వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు.  
► వీటిలో రెండు యత్నాలు విఫలం కాగా.. అయిదు ప్రాంతాల్లో 19 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. కొన్ని గంటల్లోనే ఉమేష్‌ను గుర్తించడంతో పాటు అహ్మదాబాద్‌లో ఆచూకీ కనిపెట్టిన నగర పోలీసులు అక్కడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు పట్టుకున్నారు. తమ కేసుల్లో అరెస్టు చూపించుకుని కొంత బంగారం రికవరీ చేశారు. ఆ సందర్భంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు బెంగళూరు అధికారులూ అహ్మదాబాద్‌ వెళ్లినా... ఉమేష్‌ అప్పగించమంటూ స్పష్టం చేసి, కనీసం మాట్లాడేందుకూ అవకాశం ఇవ్వలేదు.  

పక్కా విచారణతో.. 
► ఉమేష్‌ను అరెస్టు చూపించిన వడాజ్‌ పోలీసులు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. ఆ సందర్భంలో నిందితుడు తాను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నేరాలు చేశానని, తెంచిన గొలుసులన్నీ అక్కడే పడిపోయాయంటూ చెప్పాడు. నిందితుడిని పక్కాగా విచారించకపోవడంతో ఆ పోలీసులు విషయం రాబట్టలేక ఇదే రికార్డు చేసుకున్నారు. హఠాత్తుగా పోలీసు కస్టడీ నుంచి ఉమేష్‌ పారిపోవడంతో అహ్మదాబాద్‌ పోలీసుల తీరుపై సందేహాలు 
తలెత్తాయి.  
► ఉమేష్‌ కోసం ముమ్మరంగా గాలించిన అక్కడి క్రైమ్‌ బ్రాంచ్‌ గత నెల్లో పట్టుకుంది. ఆపై నిందితుడిని పీటీ వారెంట్‌పై బెంగళూరు పోలీసులు తీసుకువెళ్లి అరెస్టు చేయడంతో పాటు రూ.4 లక్షల విలువైన బంగారం రికవరీ చేశారు. 
► కొన్ని రోజుల క్రితం ఉమేష్‌ను పీటీ వారంట్‌పై తీసుకుచ్చిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం వరకు చాకచక్యంగా విచారించిన అధికారులు ఉమేష్‌ నోటి వెంట నిజం చెప్పించారు. ఇక్కడి అయిదు నేరాల్లో కాజేసిన 19 తులాల బంగారం నరన్‌పురలోని తన ఇంట్లోనే దాచి ఉంచానని బయటపెట్టాడు. దీంతో ఉమేష్‌ను తీసుకుని అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఈ బంగారం రికవరీ చేసుకువచ్చింది.  

► హైదరాబాద్, రాచకొండ పోలీసులూ ఉమేష్‌ను పీటీ వారంట్‌పై అరెస్టు చేయనున్నారు. తమ రెండు కేసులకు సంబంధించిన బంగారం మినహా మిగిలింది ఆయా అధికారులకు అప్పగించాలని పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు.
ఈ వార్త కూడా చదవండి: ట్రావెల్స్‌ బస్సు.. లారీ ఢీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top